CNG Tractor: డీజిల్ అవసరం లేని ట్రాక్టర్.. రైతుల పాలిట వరం.. వివరాలు ఇవే
CNG Tractor: డీజిల్ అవసరం లేని ట్రాక్టర్.. రైతుల పాలిట వరం.. వివరాలు ఇవే
రైతులకు ట్రాక్టర్‌కు విడదీయరాని సంబంధముంది. వ్యవసాయానికి సంబంధించి ఏం పని చేయాలన్న ట్రాక్టర్ తప్పనిసరి. దుక్కి దున్నింది మొదలు.. విత్తనాలు వేయడం, పంట కోయడం, ధాన్యాన్ని మార్కెట్‌కు తరలించడం వరకు.. అన్నింటా ట్రాక్టరే కీలక పాత్ర పోషిస్తుంది. ఐతే ప్రస్తుతం మార్కెట్లో డీజిల్‌తో నడిచే ట్రాక్టర్లే ఉన్నాయి. పెరుగుతున్న ధరలతో రైతులపై అదనపు భారం పడుతోంది. ఈ క్రమంలోనే రైతుల ఖర్చును తగ్గించే సరికొత్త ట్రాక్టర్ వచ్చేసింది. ఇది డీజిల్‌తో కాకుండా CNGతో నడుస్తుంది. దేశంలో తొలి సీఎన్జీ ట్రాక్టర్‌ను కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఇవాళ ఆవిష్కరించనున్నారు.
రామట్ టెక్నో సొల్యూషన్స్, టొమాసెటో అచిల్లీ ఇండియా సంస్థలు సంయుక్తంగా ఈ ట్రాక్టర్‌ను రూపొందించాయి.
సీఎన్జీ ఇంధనంతో ట్రాక్టర్‌తో రైతులకు ఖర్చులు తగ్గి ఆదాయం పెరగనుంది. గ్రామీణ ప్రాంతాల్లో కొత్త అవకాశాలను సృష్టించనుంది. ఈ ట్రాక్టర్ వలన ఒక రైతుకు ఏటా రూ. లక్ష ఆదా అవుతుందని కేంద్ర రవాణాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తద్వారా రైతులకు లాభం జరుగుతుందని వెల్లడించింది. సీఎన్జీ ట్రాక్టర్‌ను నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు నరేంద్రసింగ్ తోమర్, ధర్మేంద్ర ప్రదాన్, పురుషోత్తం రూపాలా, వీకే సింగ్ కూడా పాల్గొంటారు.
సీఎన్టీ ట్రాక్టర్‌తో ప్రధానంగా మూడు లాభాలున్నాయి. దీనికి డీజిల్‌తో నడిచే ట్రాక్టర్‌తో సమానంగా లేదా అంత కంటే ఎక్కువ సామర్థ్యం ఉంటుంది. డీజిల్ ఇంజిన్‌తో పోల్చితే 70 శాతం తక్కువ ఉద్గారాలు విడుదలవుతాయి. ముఖ్యంగా రైతులకు ట్రాక్టర్‌పై పెట్టే ఖర్చులో 50శాతం తగ్గుతుంది. ఎందుకంటే ప్రస్తుతం లీటర్ డీజిల్ ధర రూ.80-84 వరకు ఉంది. అదే కేజీ సీఎన్జీ ధర రూ.42 మాత్రమే. ఈ ట్రాక్టర్‌తో ఖర్చు తగ్గడంతో పాటు పర్యావణానికి కూడా ఎక్కువగా హాని జరగదు.
సీఎన్జీ చాలా పరిశుభ్రమైన, నాణ్యమైన ఇంధనం. ఇందులో కార్భన్, ఇతర కాలుష్య కారకాలు చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే ఉంటాయి. అంతేకాదు డీజిల్ ఇంజిన్‌తో పోల్చితే సీఎన్జీ ఇంజిన్ ఎక్కువ మన్నికైనది. చాలా కాలం వరకు ఇంజిన్ పాడవదు. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. ప్రస్తుతం మండుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, వాతావరణ కాలుష్య నేపథ్యంలో.. చాలా కంపెనీలు సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిపై దృష్టిసారించాయి. రాబోయే రోజుల్లలో అనేక కంపెనీలు ఇలాంటి పర్యావరణ సహిత వాహనాలను ఉత్పత్తి చేయబోతున్నాయి.
No comments