Latest

Loading...

SEC vs Kodali Nani: కొడాలి నానికి నిమ్మగడ్డ షాక్.. ప్రెస్ మీట్ పెట్టిన గంటలోనే నోటీసులు

   


ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం మరోసారి వేడెక్కింది. మరో మంత్రిపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు నోటీసులు కూడా జారీ చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేష్ కు నోటీసులిచ్చి మీడియాతో మాట్లాడవద్దంటూ ఆదేశాలిచ్చిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. కొడాలి నానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రేషన్ సరుకుల డోర్ డెలివరీ అంశంపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొడాలి నాని వ్యాఖ్యలను పరిశీలించామని.. ఆ వ్యాఖ్యలు ఎస్ఈసీని కించపరిచేవిగా ఉన్నాయని నోటీసుల్లో పేర్కొన్నారు. మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు సాయంత్రం 5గంటల లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. వ్యక్తిగతంగా గాని, సహాయకుల చేతగాని వివరణ ఇవ్వడంతో పాటు బహిరంగ ప్రకటన కూడా చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

కొడాలి ఏమన్నారంటే...

తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన మంత్రి కొడాలి నాని.. రాష్ట్రంలో రేషన్ సరుకుల డోర్ డెలివరీని అడ్డుకునేందుకు ఎస్ఈసీ, చంద్రబాబు యత్నిస్తున్నారని ఆరోపించారు. అలాగే పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనాన్ని ఎస్ఈసీ నిమ్మగడ్డ, చంద్రబాబు కలిసి వచ్చినా అడ్డుకోలేరన్నారు. వీరంతా జగన్నాథరథ చక్రాల కింద నలిగిపోవడం ఖాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును, నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు పిచ్చి పెట్టిందని.. వారిని పరీక్షించి ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చెర్పించి ట్రీట్ మెంట్ ఇవ్వాలని ఎద్దేవా చేశారు.

వివరణ ఇస్తారా..?

మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడిన గంటలోనే ఎస్ఈసీ నిమ్మగడ్డ షోకాజ్ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. ఐతే దీనిపై కొడాలి నాని రియాక్షన్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని గృహనిర్బంధం చేయాలని ఆదేశించగా.. హైకోర్టు వాటిని కొట్టేసింది. మీడియాతో మాట్లాడొద్దని మాత్రం తేల్చింది. జోగి రమేష్ చేసిన కామెంట్స్ పై సీరియస్ అయిన ఎస్ఈసీ మీడియాతో మాట్లాడటం గానీ, బహిరంగసభల్లో పాల్గొవడం గానీ చేయవద్దంది. దీనిపై ఆయన హైకోర్టుకెళ్లే ఆలోచలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు కొడాలి నాని స్పందనపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మీడియాతో మాట్లాడిన వెంటనే తన సొంత నియోజకవర్గానికి వెళ్లిపోయిన నాని.. ఎస్ఈసీ ఇచ్చిన డెడ్ లైన్ లోపు స్పందిస్తారా లేదా అనేది చూడాలి. ఒకవేళ నాని స్పందించకపోతే ఎస్ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది.

No comments

Powered by Blogger.