Viral - ఆ బోసినవ్వే హృదయాల్ని కదిలించింది.. రూ. 24 లక్షలు అందించింది...
ఆ బోసినవ్వే హృదయాల్ని కదిలించింది.. రూ. 24 లక్షలు అందించింది...
మనవరాలి చదువుకోసం సొంత ఇల్లు అమ్మేసిన ఓ ముంబై ఆటో డ్రైవర్ రూ.24లక్షల రూపాయలు అందుకున్నాడు. హ్యూమన్స్ ఆఫ్ ముంబైలో వచ్చిన అతని కథనాన్ని విని చాలామంది కదలిపోయారు. నిస్వార్థమైన అతని పనితీరుకు కరిగిపోయి క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఈ మొత్తాన్ని అందించారు.
వివరాల్లోకి వెడితే.. దేశ్రాజ్ అనే ముంబై ఆటో డ్రైవర్ కు ఇద్దరు కొడుకులు. వారు మరణించడంతో వారి కుటుంబాల బాధ్యత ఈ ముసలి భుజాలపై పడింది. కోడళ్లు, వారి నలుగురు పిల్లల కోసం అతను రేయింబవళ్లు ఆటో నడిపేవాడు.
అతని సంపాదనలో ఎక్కువ భాగం పిల్లల చదువుకే పోయేది. అయితే తన కష్టానికి ఫలితం వచ్చిందని సంతోషంగా చెప్పుకొచ్చారు. తన మనవరాలు 12వ తరగతిలో 80 శాతం మార్కులు సాధించిందని తెలిపారు.
ఆ తరువాత మనవరాలు ఢిల్లీలో బీఈడి కోర్స్ చేయాలని ఆశపడింది.
అయితే దానికి కావాల్సిన సొమ్ము తన తాహతుకు మించింది. అందుకే ఆమె కల నెరవేర్చడం కోసం ఉంటున్న ఇంటిని అమ్మేశాడు. ఆ డబ్బుతో ఆమె ఫీజు కట్టాడు. దేశ్రాజ్ కథను హ్యూమన్స్ ఆఫ్ ముంబై సోషల్ మీడియాలో షేర్ చేసింది. అది వేలాదిమంది నెటిజన్లను కదిలించింది.
దీంతో అతనికి సహాయం చేస్తామంటూ చాలామంది ముందుకొచ్చారు. ఆటో డ్రైవర్‌కు సహాయం చేయమని ముంబై వాసులకు విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్‌కు చెందిన అర్చన దాల్మియా ఈ కథనాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌ను మిలింద్ డియోరా కూడా రీట్వీట్ చేశారు.
గుంజన్ రట్టి అనే ఫేస్బుక్ యూజర్ దేశ్రాజ్ కోసం నిధుల సేకరణ ప్రారంభించాడు. అతను మొదట రూ. 20 లక్షలు లక్ష్యంగా పెట్టుకున్నాడు. కానీ అది దాటిపోయింది. మొత్తం రూ. 24 లక్షలు జమయ్యాయి. వీటిని దేశ్రాజ్ కు అందించారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా సోమవారం సోషల్ మీడియాలో షేర్ చేశారు.
దీంట్లో దేశ్రాజ్ తనకు సాయం చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ హ్యూమన్స్ ఆఫ్ ముంబై.. దేశ్రాజ్ కి లభించిన మద్దతు అద్భుతం, దీనివల్ల అతనికి తలదాచుకునేందుకు ఓ గూడు లభించింది. అతని మనవళ్లకు స్కూలు ఫీజులు కట్టగలుతున్నాడు. మీ ప్రేమకు కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చింది.
No comments