Latest

Loading...

YS Sharmila: తెలంగాణ విషయంలో షర్మిల ధీమా అదేనా.. లాజిక్‌తోనే రంగంలోకి..?

 YS Sharmila: తెలంగాణ విషయంలో షర్మిల ధీమా అదేనా.. లాజిక్‌తోనే రంగంలోకి..?

తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టాలని వైఎస్ షర్మిల నిర్ణయించుకోవడం.. అందుకు సంబంధించి ప్రకటన కూడా చేయడం రాజకీయాల్లో సంచలనంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టాలన్న షర్మిల నిర్ణయంపై అనేక మంది అనేక రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె వెనుక కేసీఆర్ ఉన్నారని ఆరోపిస్తే.. మరికొందరు ఆమె పార్టీ వెనుక బీజేపీ ఉందని విమర్శిస్తున్నారు. మరోవైపు ఆమె పార్టీతో మాకేమీ సంబంధం లేదని ఏపీలోని వైఎస్ జగన్ సారథ్యంలోని వైసీపీ తేల్చిచెప్పింది. ఇవన్నీ ఎలా ఉన్నా.. తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్న షర్మిల.. ఇక్కడ ఏం చెప్పి ప్రజలను ఓట్లు అడుగుతారనే దానిపై అందరిలోనూ సందేహాలు నెలకొన్నాయి. పక్క రాష్ట్రానికి చెందిన వ్యక్తి తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి ఏ విధంగా ఇక్కడ ప్రజలను ఆకట్టుకుంటారన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

షర్మిల భర్త బ్రదర్ అనిల్ స్వస్థలం ఖమ్మం జిల్లా. ఆయన పెరిగింది హైదరాబాద్‌లోనే. ఈ లెక్కన తాను తెలంగాణ కోడలినని షర్మిల చెప్పనున్నారని.. ఆ రకంగా తనకు ఇక్కడ రాజకీయాలు చేసే అర్హత ఉందని ఆమె ప్రచారం చేసుకోనున్నారని తెలుస్తోంది. తెలంగాణతో షర్మిలకు ఏం సంబంధం అనే ప్రశ్నకు ఆమె చెప్పబోయే సమాధానం ఇదేనని.. తనకు ఏపీతో పాటు తెలంగాణ కూడా సమానమే అని చెప్పబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక తెలంగాణలో తన రాజకీయ పార్టీకి సంబంధించి ఇప్పటికే ఆమె కసరత్తు ముమ్మరం చేశారని.. పార్టీ అజెండా ఏ విధంగా ఉండాలనే అంశంతో పాటు పార్టీ నాయకత్వాన్ని ఏ విధంగా బలపరుచుకోవాలనే దానిపై సమాలోచనలు జరుపుతున్నారని తెలుస్తోంది. మొత్తానికి మరో రెండు నెలల్లో తెలంగాణలో షర్మిల పెట్టబోయే రాజకీయ పార్టీ విధివిధానాలతో పాటు మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

No comments

Powered by Blogger.