Latest

Loading...

పోలీస్ స్టేషనే ఆమె ఇల్లు.. పోలీసులే చుట్టాలు.. ఆధార్ కార్డులో కూడా అడ్రస్ అదే.. 40 ఏళ్ల నుంచి అక్కడే.. ఎవరు? ఎక్కడ..


సాధారణంగా పోలీసులు అందరి బంధువులు అంటూ ఉంటారు. మనకు కష్టం వచ్చినప్పుడు వారినే సంప్రదిస్తాం కాబట్టి వారు అందరికీ చుట్టాలని చెప్పడం సహజం. కానీ ఆ మహిళకు మాత్రం పోలీసులు నిజంగా చుట్టాలే.. ఆమె నివాసం కూడా పోలీస్ స్టేషనే.. తన ఆధార్ కార్డ్ పైన కూడా పోలీస్ స్టేషన్ చిరునామానే ఉండడం విశేషం. కర్ణాటకలోని మంగళూరుకి చెందిన బండారు పోలీస్ స్టేషన్ కి నలభై ఏళ్ల క్రితం చేరుకుంది హొన్నమ్మ. అప్పటికి 20 సంవత్సరాల వయసున్న ఆమెకి పుట్టుకతోనే మూగ , చెవుడు.. చదువు కూడా పెద్దగా రాకపోవడంతో తాను ఎవరు? ఎక్కడి నుంచి వచ్చిందన్న వివరాలను చెప్పలేకపోయింది. రైల్వే స్టేషన్ లో కనిపించిన ఆమెను పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి ఇక్కడ ఆశ్రయం ఇచ్చారు అప్పటి పోలీస్ అధికారులు.ఆమెకు చికిత్స చేయించి మాట తీసుకురావడానికి ప్రయత్నించినా ఎలాంటి ఫలితం లేకపోయింది. హొన్నమ్మ అసలు పేరు కూడా వారికి తెలియకపోవడంతో ఆమె బంధువుల గురించి ఎంత ఆరా తీసినా వివరాలు తెలియలేదు. దీంతో అప్పటి నుంచి ఆమె అక్కడే పోలీస్ స్టేషన్ లోనే తన జీవితాన్ని గడుపుతోంది. పోలీసులు ఆమెకు హొన్నమ్మ అని పేరు పెట్టారు. పోలీసులే ఆమెకు చుట్టాలై తనని కాపాడారు.

మాటలు రాకపోయినా, చెవులు వినిపించకపోయినా హొన్నమ్మ రోజంతా చాలా యాక్టివ్ గా పని చేస్తుంది. ఉదయాన్నే లేచి పోలీస్ స్టేషన్ మొత్తం శుభ్రం చేస్తుంది. రాత్రి పోలీస్ స్టేషన్ వెనుకే ఉన్న ఓ గదిలో పడుకుంటుంది. ఆమెకు పోలీసులే రోజూ ఆహారాన్ని అందిస్తుంటారు. పండగల సమయంలో బట్టలు కొనివ్వడం, డబ్బులు ఇవ్వడం వంటివి చేస్తుంటారు. ఆ డబ్బులతో పాటు రోజూ పోలీస్ స్టేషన్ ని శుభ్రం చేసినందుకు హొన్నమ్మకి జీతం కూడా ఇస్తున్నారు. ఈ డబ్బులన్నింటినీ ఆమె పొదుపుగా ఖర్చు చేసుకుంటూ బ్యాంక్ లో కూడా దాచి పెట్టుకుంటోంది. పోలీస్ స్టేషన్ లో జరిగే ప్రతి ముఖ్యమైన కార్యక్రమంలో హొన్నమ్మ ఉండాల్సిందే. హొన్నమ్మ అన్ని విషయాల్లోనూ యాక్టివ్ గా ఉంటుంది. బ్యాంక్ కి వెళ్లడం, అన్ని వివరాలు తెలుసుకోవడం, ఓటు వేయడం వంటివన్నీ తనే ఒంటరిగా చేసుకుంటుంది.

ఆమె బ్యాంక్ పాస్ బుక్ తో పాటు ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు వంటివన్నీ పోలీస్ స్టేషన్ చిరునామాతోనే ఉండడం విశేషం. అప్పటి డిప్యూటీ సూపరిండెంట్ అయిన జయంత్ శెట్టి ప్రస్తుతం రిటైర్ అయ్యారు. ఆయన హొన్నమ్మ దొరికిన సందర్భం గురించి గుర్తుచేసుకుంటూ ఆమె తమిళనాడు నుంచి వచ్చిందని.. తన వాళ్ల గురించి అంతకంటే వివరాలేవీ చెప్పలేకపోయిందని వెల్లడించారు. ప్రతి పనిలో ఆమె చూపే వేగాన్ని చూసి పోలీస్ స్టేషన్ లోనే ఆమెకు ఉద్యోగం ఇచ్చామని.. ఆ బాధ్యతలను ఆమె చాలా చక్కగా నిర్వహిస్తోందని వెల్లడించారు. తన సైగ భాషతోనే పోలీసులు తనకు ఉండేందుకు నివాసం, ఉద్యోగం ఇచ్చి తనకు అండగా నిలిచారని.. వారికి ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పింది హొన్నమ్మ. ప్రస్తుతం ఆమె వయసు 60 కి చేరుకోవడంతో ఆమె పెన్షన్ తో పాటు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సౌకర్యాలు అందించేందుకు పోలీస్ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

 

No comments

Powered by Blogger.