ఈ దొంగలు యమా స్మార్ట్.. పోలీస్ స్టేషన్ కే కన్నమేశారు !
మన ఇంట్లో ఏవైనా వస్తువులు పోతే వెళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేస్తాం..మరి పోలీస్ స్టేషన్‌లోనే చోరీ చేస్తే?..అవును మీరు వింటున్నది నిజమే. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం పోలీస్ స్టేషన్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఈ సంఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం వీరవాసరం పోలీస్ స్టేషన్ లో దొంగలు పడ్డారు. ఏకంగా 8 లక్షలు కాజేశారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో వచ్చిన ఆదాయాన్ని సూపర్ వైజర్లు ప్రతి రోజు బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులు కావడంతో వచ్చిన ఆదాయాన్ని ఎవరి దగ్గర దాచకుండా నాలుగు మద్యం షాపుల సూపర్ వైజర్లు పోలీస్ స్టేషన్ లో భద్రపరిచారు.ఈ నెల 15వ తేదీన ఓ బాక్స్ లో సుమారు 8 లక్షల 4 వేల 330 రూపాయల నగదును పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆ డబ్బును లాకప్ లో ఉంచి తాళం వేశారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. బ్యాంకులు తెరవడంతో డబ్బు తీసుకోవడానికి వెళ్లిన సూపర్ వైజర్లు అవాక్కయ్యారు. పోలీస్ స్టేషన్లో దాచిన డబ్బు కనిపించలేదు. బాక్సులో డబ్బు లేకపోవడంతో అందరూ అవాక్కయ్యారు. వేసిన తాళం వేసినట్లు ఉన్న అందులో డబ్బు మాయమవడంతో సూపర్ వైజర్లు లబోదిబోమంటున్నారు. అసలు అందులో డబ్బు పెట్టారా లేక కట్టుకథ చెప్పారా...? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
మరో వైపు పోలీస్ స్టేషన్ లో ఉన్న ఇంటి దొంగల పని ఏమైనా అయ్యి ఉంటుందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు. ఇక పోలీస్ స్టేషన్లో డబ్బు మాయమైన ఘటనపై జిల్లా పోలీస్ అధికారులు సీరియస్ గా ఉన్నారు. నిందితులు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని, బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీస్ స్టేషన్ లోనే రక్షణ కల్పించలేని పోలీసులు సమాజానికి ఏమి రక్షణ కల్పిస్తారు, న్యాయం ఎలా చేస్తారు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
No comments