భారత్‌లో సెకండ్ వేవ్ మొదలైనట్టేనా..? రానున్న రోజుల్లో ఎక్కువ కానున్నాయా..? "
గత కొద్ది నెలలుగా భారతదేశంలో కోవిడ్ 19 కేసులు బాగా తగ్గిపోయాయని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో, మళ్లీ కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరగడం కలవరపెడుతోంది. భారత్‌లో కరోనా వైరస్ 2021 చివరి వరకూ ఉండే అవకాశం ఉందని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ రణదీప్ గులేరియా విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న కేసుల సరళిని పరిశీలిస్తే... వచ్చే ఏడాది కూడా కొద్ది నెలల పాటు వైరస్ ప్రభావం ఉండవచ్చన్నారు. 'కరోనా మహమ్మారి 2021 చివరి వరకూ ఉండదని చెప్పేందుకు లేదు. అయితే కేసుల సంఖ్య భారీగా కంటే నిలకడగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రముఖ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గులేరియా ఈ వివరాలు వెల్లడించారు.దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా వైరస్ తిరగబెడుతుండటం చూస్తున్నామని... ఇది ఒక రకంగా కరోనా సెకండ్ వేవ్ అని గులేరియా పేర్కొనడం గమనార్హం.
మొదట చాలా జాగ్రత్తలు తీసుకున్న జనాలు ఆ తర్వాత కనీసం మాస్కు కూడా వాడటం లేదు. దీంతో వైరస్ వ్యాప్తికి కారణం అవుతున్నారు. తాజాగా మహారాష్ట్రలో జరిగిన సంఘటన ఇందుకు ఉదాహారణగా చెప్పుకోవాలి. లాతూర్ జిల్లా ఎంఐడీసీ ప్రాంతంలోని ఓ హాస్టల్‌లో ఏకంగా 44 మంది హాస్టల్ విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సదరు హాస్టల్‌లో 8 నుంచి 10వ తరగతి విద్యార్థులు వసతి పొందుతున్నట్టు సమాచారం. ఇది ఇలా ఉంటే గురువారం లాతూర్‌లో 146 మందికి కరోనా సోకినట్టు పరీక్షల్లో తేలింది. ఇదే సమయంలో మరో 41 మంది వైరస్ నుంచి కోలుకోగా.. మరొకరు మృతి చెందారు. వైరస్ సోకిన వారిలో 91 మంది లాతూర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నివాసం ఉంటున్నట్టు అధికారులు గుర్తించారు. కాగా, ఇదే జిల్లాలో కరోనాతో ఇప్పటివరకు 715 మంది చనిపోవడం గమనార్హం. వెంటనే అప్రమత్తమైన వైద్యాధికారులు వారిని క్వారంటైన్ కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కరోనా వ్యాప్తి మొదలైన కొత్తలో చాలా జాగ్రత్తలతో వ్యవహరించినవారు జనాలు ఇప్పుడు లైట్ తీసుకోవడం మొదలుపెట్టారని అందుకే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. కేసులు పెరగడానికి ఇదో ముఖ్య కారణమన్నారు. ఎక్కడిదాకో ఎందుకు... దేశ రాజధాని ఢిల్లీలోనే ప్రజలు మాస్కులు ధరించడం లేదన్నారు. గతంలో మాదిరి మళ్లీ గుంపులుగా చేరుతున్నారని... ట్రాఫిక్ జామ్స్ కూడా పెరిగిపోయాయని.. ఒక రకంగా ప్రీ-కరోనా రోజులు వచ్చేశాయని అన్నారు. కరోనా కేసుల సంఖ్య పెరగడానికి ఇవన్నీ కారణమన్నారు.
No comments