పులకించిన పొన్నవరం
జస్టిస్ రమణ స్వస్థలంలో హర్షాతిరేకాలు
(ఆంధ్రజ్యోతి - విజయవాడ/కంచికచర్ల)
సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకట రమణ నియమితులవుతున్నారన్న వార్త ఆంధ్రుల్లో హర్షాతిరేకాలను రేపింది. జస్టిస్ రమణ స్వగ్రామం కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరంలో ఈ విషయం తెలుసుకున్న అనేకమంది ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకున్నారు. సాధారణ రైతు కుటుంబానికి చెందిన నూతలపాటి గణపతిరావు, సరోజిని దంపతులకు రమణ జన్మించారు. కుటుంబం ఆర్థికంగా పలు ఇబ్బందులు పడినా, ఆయన పట్టుదలతో కష్టపడి చదువుకున్నారు. ప్రాథమిక విద్యను కంచికచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అభ్యసించారు.గుంటూరు జిల్లా ధరణికోట (అమరావతి) ఆర్‌వీవీఎన్ కళాశాలలో బీఎస్సీ చదివారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి 1982లో న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. జస్టిస్ రమణకు తెలుగు భాష పట్ల మమకారం ఎక్కువ. అవసరమైతే తప్ప ఇంగ్లీషులో మాట్లాడరు. తెలుగులో న్యాయపాలనకు ఆయన ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు.
No comments