Mental Health: బాల్యం ఇలా ఉంటే భవిష్యత్తులో కష్టాలు... తాజా అధ్యయనంలో వెల్లడి
Mental Health: బాల్యం ఇలా ఉంటే భవిష్యత్తులో కష్టాలు... తాజా అధ్యయనంలో వెల్లడి
చిన్న పిల్లలు ఒత్తిడికి అలవాటు పడకపోతే... పెరిగే కొద్దీ దాని ప్రభావం వారి ఆరోగ్యం మీద పడుతుంది. దీంతో పెద్దయ్యాక గుండెపోటు, డయాబెటిస్ వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలాంటి కష్టాలూ రాకుండా సుకుమారంగా పెంచుతుంటారు. తద్వారా, భవిష్యత్తులో కూడా తమ పిల్లలు ఏ కష్టాలూ లేకుండా జీవిస్తారని అనుకుంటారు. కానీ, ఈ భావన తప్పని ఆస్ట్రేలియా పరిశోధకుల తాజా అధ్యయనంలో తేలింది. బాల్యంలో ఏ కష్టాలు లేకుండా సంతోషంగా జీవించినా, పెద్దయ్యాక మానసిక సమస్యలకు లోనయ్యే అవకాశం ఉందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. సంతోషకరమైన, సురక్షితమైన బాల్యం పెద్దయ్యాక వారిని రక్షిస్తుందని చెప్పలేమని అధ్యయనం సూచించింది.
ఆస్ట్రేలియాలోని కాన్ బెర్రా విశ్వవిద్యాలయ భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ అధ్యయనంలో చిన్ననాటి అనుభవాలు, పెద్దయ్యాక ఎలా ప్రభావం చూపిస్తాయి?.. ఈ అనుభవాలు మానసిక ఆరోగ్యంతో ఎలా సంబంధం కలిగి ఉంటాయి?.. వంటి ప్రశ్నలపై అధ్యయనం కొనసాగింది. అయితే, ఫలితాలు ఆసక్తికరంగా వచ్చాయి. బాల్యంలోని సానుకూల, ప్రతికూల అనుభవాలు యుక్తవయస్సులో ఆందోళన లేదా ఇతర మానసిక రుగ్మతలకు కారణమవుతాయని పరిశోధకులు తెలిపారు.
ఈ అధ్యయనం ఆస్ట్రేలియాకు చెందిన 4 నుంచి 11 సంవత్సరాల మధ్య గల 3,14,000 మంది బాలబాలికపై జరిగింది. ఆస్ట్రేలియాలో ఎక్కువ మంది ప్రజలు బాల్యంలో సంతోషంగా జీవించినప్పటికీ, జనాభాలో దాదాపు 50 శాతం మంది యుక్తవయస్సుకు వచ్చాక వారి జీవితంలో ఏదో ఒక సమయంలో మానసిక ఒత్తిడి చెందుతున్నారని తేలింది. కాబట్టి, మానసిక ఆరోగ్య పరిస్థితులను బాల్యంలోని జీవిత సంఘటనలను బట్టి నిర్వచించలేమని అధ్యయనం స్పష్టం చేసింది. సంతోషకరమైన ఇంటిలో పెరిగిన పిల్లవాడు సైతం పెద్దయ్యాక మానసిక ఆరోగ్య రుగ్మతలకు లోనయ్యే అవకాశం ఉందని ఈ పరిశోధన చూపిస్తుంది. కాగా, ఈ అధ్యయన ఫలితాలు 'కరెంట్ ఫిలాసఫీ' అనే జర్నల్‌లో రాశారు.
ఈ ఫలితాలపై అధ్యయన రచయిత కాహ్ల్ మాట్లాడుతూ "బాల్యంలో ఏ కష్టాలకూ లోనవ్వనివారిలో సమస్యలను ఎదుర్కొనే శక్తి తక్కువగా ఉంటుంది. వారు పెద్దయ్యాక తమ అంచనాలను అందుకోనప్పుడు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. అందువల్ల, తల్లిదండ్రులు వారి పిల్లలను బాల్యంలో మరీ సుకుమారంగా పెంచకూడదు. పరిస్థితులకు అనుగుణంగా ఎలా ఉండాలో వారికి నేర్పించాలి. ప్రతికూల పరిస్థితుల్లో సమస్యలను ఎలా ఎదుర్కోవాలో కూడా చెప్పాలి. తద్వారా, భవిష్యత్తులో మానసిక ఒత్తిడి, ఇతర ప్రమాదాల నుంచి ఎలా బయటపడాలో వారికి తెలుస్తుంది." అని కహ్ల్ తెలిపారు.
No comments