Memory Loss : జ్ఞాపకశక్తి తగ్గిందా? అది కరోనా లక్షణమే.. జాగ్రత్త...!
Memory Loss in Covid : కరోనా వైరస్ సోకితే.. దగ్గు, జలుబు, జ్వరం, కండరాల నొప్పులు ఉంటాయని తెలుసు.. అయితే జ్ఞాపకశక్తి తగ్గినా అది కరోనా లక్షణమేనట.. కరోనా సోకినవారిలో మెదడు, నరాలపైనా ప్రభావం పడుతున్నదని ప్రముఖ న్యూరో సర్జన్ రంగనాథమ్ పేర్కొన్నారు. కరోనా వైరస్ ప్రభావం మెదడుపై పడటంతో జ్ఞాపక శక్తి తగ్గుతుందన్నారు. ఉదయం లేవగానే ఏ పనీ చేయలేకపోవడం, ఏదీ గుర్తుండక పోవడం, చికాకుగా ఉండటం వంటి లక్షణాలు ఉంటాయన్నారు.
నిద్ర లేకపోవడంతో పాటు మానసిక సమస్యలు కూడా వస్తున్నాయని తెలిపారు. కంటిచూపు కూడా పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ముందుగానే గుర్తించి కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నదని, అందరూ జాగ్రత్తగా ఉండాలంటున్నారు.
చాలా మందికి తమకు వైరస్ వచ్చింది అన్న సంగతి తెలియడం లేదన్నారు. దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు మాత్రమే ఉంటాయని భావిస్తున్నారు.
అంతకంటే ముందుగానే కొంత మందిలో నరాలపైనా ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. మెదడు సరిగా పనిచేయదని చెబుతున్నారు. వైరస్ ఉన్న వ్యక్తికి క్రమంగా జ్ఞాపక శక్తి తగ్గుతుందని ఏ పనీ చేయలేరని అంటున్నారు. చికాకుగా అనిపిస్తుంది.. 50 ఏళ్లు దాటిన పేషెంట్ జ్ఞాపక శక్తి తగ్గిందంటూ ఆస్పత్రికి రాగా పరీక్షలు నిర్వహించారు. అందులో అతడికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. కరోనా సోకిన వారిలో మానసికంగా మార్పులు వస్తున్నాయి డిప్రెషన్‌కు గురవుతున్నారు. మానసిక ధైర్యం తగ్గుతోంది. అలాగే నిద్ర ఉండదు. మానసిక వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
కరోనా సోకిన వారిలో ముందుగానే రుచి, వాసన పోతుంది. ముక్కు, గొంతులో పలుచని నరాలు ఉంటాయి. వైరస్ సోకిన వారిలో ముక్కు రంధ్రాలు, గొంతులోని పలుచని నరాలు పనిచేయవు. వాసన పూర్తిగా కోల్పోతారు. దగ్గు, జలుబు, జ్వరం లేకుండా వైరస్ సోకిన వ్యక్తి శరీరంలో ఉండే లక్షణాలుగా వైద్యులు గుర్తించారు. ఇలాంటి లక్షణాలు ఉన్న వారు వెంటనే హోం ఐసొలేషన్‌లోకి వెళ్లాలని సూచిస్తున్నారు.
No comments