Teachers : ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలి
రాష్ట్రంలో కరోనా భారిన పడి రోజుకు నలుగురైదుగురు
ఉపాధ్యాయులు చనిపోతున్నారని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కరణం హరికష్ణ, మాగంటి శ్రీనివాసరావు రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి గుత్తి ప్రేమనాథ్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఫ్రంట్ లైన్ వర్కర్ల కంటే ఎక్కువ ప్రమాదకర పరిస్థితిలో ఉపాధ్యాయులు ఉన్నారని పేర్కొన్నారు. కరోనా భారిన పడి చనిపోయిన ఉపాధ్యాయుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియోగా ప్రకటించాలని డిమాండ్‌చేశారు. పాజిటివ్ వచ్చిన ఉపాధ్యాయులకు 14 రోజుల స్పెషల్ సిఎల్‌లకు తగిన ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు.
పదో తరగతి సిలబస్ పూర్తయినందున, ప్రిపరేషన్ హాలిడేస్ ప్రకటించి అన్ని పాఠశాలలను పూర్తిగా మూసివేయాలని కోరారు. అత్యవసరమైన పరిస్థితులు ఎదురైతే పాఠశాలలను కోవిడ్ కేంద్రాలుగా ఉపయోగించుకోవాలని సూచించారు. కరోనా వచ్చిన ఉపాధ్యాయులకు కోవిడ్ ఆసుపత్రుల్లో ఈహెచ్‌ఎస్ క్రింద ఉచితంగా చికిత్స చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి కోవిడ్ ఆసుపత్రిలో కనీసం 5 బెడ్లు, ఉపాధ్యాయులు, వారి కుటుంబాలకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. బెడ్‌ల కొరత కారణంగా ఏ ఆసుపత్రి ఉపాధ్యాయులు, ఉద్యోగులకు చికిత్సను నిరాకరించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయులకు వారికి ఇష్టమైన వాక్సిన్‌ను వేయించుకునే స్వేచ్ఛను కల్పించాలని విజ్ఞప్తిచేశారు.
No comments