Corona: కొవిడ్‌లో వ్యాయామం ప్రాణానికి ముప్పు.. కోలుకున్న తర్వాత కూడా వెంటనే చేయొద్దు..!!
కొవిడ్ లక్షణాలు తగ్గగానే.. ఆర్‌టీపీసీఆర్ పరీక్ష చేయించుకుని నెగెటివ్ రాగానే కొందరు వ్యాయామాలు చేస్తున్నారు. పూర్వం మాదిరిగానే కిలోమీటర్ల కొద్దీ నడుస్తున్నారు. కాళ్లూ చేతులూ వేగంగా ఊపుతూ బ్రిస్క్ వాకింగ్ చేస్తున్నారు. సైకిల్ తొక్కుతున్నారు. ఈత కొట్టడం, యోగాసనాలు వేయడం వంటివీ చేస్తున్నారు. స్వల్ప లక్షణాలతో కొవిడ్ బారినపడినవారైనా సరే.. వైద్యుల సలహా లేకుండా ఇలాంటివేవీ మొదలు పెట్టొద్దు. సాధారణంగా శారీరక శ్రమ చేయడం ద్వారా ఒంట్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందంటారు. ఇది నిజమేకానీ కొవిడ్‌కు ఈ సూత్రం వర్తించదు. కొవిడ్‌తో
బాధపడుతున్నప్పుడు అస్సలు వ్యాయామాలు చేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ‘‘కోలుకున్న తర్వాత వెంటనే మొదలుపెట్టడమూ శ్రేయస్కరం కాదు. కొంత కాలం మానసిక, శారీరక విశ్రాంతి పొంది.. ఆ తర్వాత క్రమేణా వ్యాయామం చేసే సమయాన్ని వారానికి 5 శాతం చొప్పున పెంచుకుంటూ వెళ్లాలి. అలా కాకుండా కరోనా చికిత్స పొందే సమయంలోగానీ.. కోలుకున్న వెంటనే గానీ తీవ్ర శారీరక శ్రమను చేయడం ద్వారా ప్రాణాపాయ ముప్పును ఎదుర్కోవాల్సిన ఉంటుంది’’ అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొవిడ్ బాధితులు ఎందుకు వ్యాయామం చేయకూడదు? ఎప్పుడు ప్రారంభించాలి? ఎలా కొనసాగించాలి తదితర అంశాలపై అందిస్తున్న ప్రత్యేక కథనం...
తప్పుడు సమాచారంతో అనర్థాలు
కొవిడ్ బాధితులు వ్యాయామాలు చేయడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందనే తప్పుడు సమాచారాన్ని కొందరు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇది నిజమే అనుకొని కొందరు వ్యాయామాలు చేస్తున్నారు. దీనివల్ల ఉపయోగం కన్నా.. అనర్థాలే ఎక్కువ. కొవిడ్‌లో ముఖ్యంగా పాటించాల్సింది పూర్తిగా మానసిక, శారీరక విశ్రాంతి. ఇందుకు విరుద్ధంగా ఆ సమయంలో కసరత్తులు చేస్తే జబ్బు తీవ్రత పెరిగే ప్రమాదముంది. అప్పటికే ఉన్న లక్షణాల తీవ్రత పెరుగుతుంది. ఆక్సిజన్ శాతం తగ్గే అవకాశముంటుంది. కొత్త సమస్యలు చుట్టుముడతాయి.
ఎక్సర్‌సైజ్‌లు ఎలా మొదలెట్టాలి?
* కొవిడ్ వచ్చి తగ్గిన మొదటి వారం పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. గదిలో అటూ ఇటూ తిరగొచ్చుకానీ.. శరీరం అలసిపోయేలా వ్యాయామాలు చేయకూడదు.
* రెండోవారంలో 10 నిమిషాల కంటే ఎక్కువగా నడవొద్దు. అలా క్రమేణా వారానికి 5 శాతం చొప్పున పెంచుతూ పూర్వస్థితికి చేరుకోవాలి.
* గట్టిగా గాలి పీల్చడం, బెలూన్లను ఊదడం వంటివి వైద్యుని పర్యవేక్షణలో చేయాలి.
* మధ్యస్థ, తీవ్ర లక్షణాలతో కొవిడ్ నుంచి కోలుకున్న వారు.. కోలుకున్న తర్వాత కూడా లక్షణాలతో బాధపడుతున్నవారు.. వైద్యుడి సూచనల మేరకు తప్పనిసరిగా కొన్ని పరీక్షలు చేయించుకోవాలి. ఉదాహరణకు ఈసీజీ, డీ డైమర్, పల్మనరీ ఫంక్షన్ టెస్టు, కనీసం 6 నిమిషాల నడక పరీక్ష, ఈ సమయంలో నడిచినప్పుడు ఆక్సిజన్ శాతం ఎలా ఉంది? నాడి ఎంత వేగంగా కొట్టుకుంటుంది? తదితర సమాచారాన్ని వైద్యుడు పరిశీలిస్తారు.
No comments