Corona: అతనో కండల వీరుడు...అయినా కరోనాకు తలొంచక తప్పలేదు..!!
హైదరాబాద్‌కు చెందిన ఓ బాడీబిల్డర్ కరోనా కారణంగా మృత్యువు వరకూ వెళ్లి సుదీర్ఘ చికిత్సతో కోలుకున్నారు. దీన్ని బట్టి చూస్తే.. కరోనా కండల వీరులను సైతం ప్రాణాపాయ స్థితిలోకి నెట్టెస్తుంది. యశోద ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరకంటి తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాజిగిరికి చెందిన 32 ఏళ్ల సుశీల్ కుమార్ గైక్వాడ్ తెలంగాణ తరఫున బాడీ బిల్డింగ్ క్రీడాకారుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏప్రిల్ చివరి వారంలో ఆయనకు కరోనా సోకడంతో స్థానిక ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలోనే ఆయనకు క్రమేణా శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. అంతేకాదు, ఆస్పత్రుల్లో బెడ్లు దొరకని స్థితిలో సాయం కోసం ఆయన కుటుంబసభ్యులు సినీ నటుడు సోనూసూద్‌ను అర్థించారు.
ఆయన చొరవతో కుటుంబ సభ్యులు సుశీల్‌ను మే నెల 19న మలక్‌పేట యశోద ఆసుపత్రిలో చేర్పించారు. బాధితుడి ఊపిరితిత్తులు దాదాపు 80 శాతం ఇన్ఫెక్షన్కు గురైనట్లు సీటీస్కాన్లో తేలింది. ఇలాంటి రోగులకు ఒక దశలో ఎక్మో చికిత్స అవసరమవుతుంది. ఆ అవసరం లేకుండానే సుదీర్ఘ కాలం చికిత్సతో సుశీల్ కోలుకోవడంతో డిశ్చార్జి చేశామని డాక్టర్ పవన్ తెలిపారు. కరోనా సోకక ముందు 100 కిలోలకు పైగా బరువున్న సుశీల్ ప్రస్తుతం 72 కిలోలకు తగ్గిపోయినట్లు పేర్కొన్నారు.
No comments