Covishield: రెండు డోసుల మధ్య 45 వారాల విరామంతో ప్రయోజనం....?
మూడో డోసు వేసుకుంటే ఇంకా ఎక్కువ రోగ నిరోధకత
ఆక్స్ఫర్డ్ పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడి
కొవిషీల్డ్ టీకా డోసుల మధ్య విరామం గురించి తాజా అధ్యయనమొకటి కీలక అంశాలను వెల్లడించింది. రెండు డోసుల మధ్య 45 వారాల వ్యవధి ఉంటే.. వ్యక్తుల్లో రోగ నిరోధకత స్పందన మరింత మెరుగ్గా కనిపిస్తున్నట్లు తేల్చింది. ఈ వ్యాక్సిన్ మూడో డోసును కూడా తీసుకుంటే యాంటీబాడీల స్థాయులు ఇంకా ఎక్కువగా వృద్ధి చెందుతున్నాయని నిర్ధారించింది. భారత్లో ప్రస్తుతం కొవిషీల్డ్ డోసుల మధ్య విరామాన్ని 12-16 వారాలుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. 18-55 ఏళ్ల మధ్య వయసున్న వాలంటీర్లపై బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు తాజా అధ్యయనాన్ని నిర్వహించారు.
ఈ అధ్యయన వివరాల ప్రకారం.. కొవిషీల్డ్ తొలి డోసును తీసుకున్నాక కనీసం ఏడాది వరకు వ్యక్తుల్లో యాంటీబాడీల స్థాయులు అధికంగా ఉంటున్నాయి. 12 వారాల విరామంతో రెండు డోసులను తీసుకున్నవారితో పోలిస్తే.. 45 వారాల (దాదాపు 11 నెలలు) వ్యవధితో ద్వితీయ డోసును పొందినవారిలో యాంటీబాడీ స్థాయులు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటున్నాయి.
రెండో డోసు (11 నెలల విరామంతో) తీసుకున్న 28 రోజుల తర్వాత యాంటీబాడీ స్పందన 18 రెట్లు పెరుగుతోంది. ద్వితీయ డోసు తర్వాత ఆరు నెలల విరామంతో మూడో డోసును తీసుకుంటే.. యాంటీబాడీ స్థాయులు ఆరు రెట్లు అధికమవుతున్నాయి. రోగ నిరోధక వ్యవస్థలో కీలకమైన టీ-సెల్ స్పందనలు కూడా మెరుగుపడుతున్నాయి.
ఆల్ఫా, బీటా, డెల్టా వేరియంట్లను అడ్డుకోవడంలో మూడో డోసు మరింత క్రియాశీలకంగా పనిచేస్తోంది. తొలి డోసు గ్రహీతలతో పోలిస్తే.. కాస్త ఆలస్యంగా రెండో డోసు తీసుకున్నవారిలో, మూడో డోసు పొందినవారిలో దుష్ప్రభావాలు తలెత్తే అవకాశాలూ తక్కువే.
No comments