Latest

Loading...

Oximeter ఆక్సీ మీటర్ లో వేలు పెడితే... అకౌంట్లో డబ్బు మాయం.. ఎలాగంటే..?

Cyber fraud Oximeter

 కరోనా కాలంలో పల్స్ ఆక్సీమీటర్ల వినియోగం భారీగా పెరిగింది. అదే సమయంలో ఆక్సీమీటర్ల పేరుతో ప్రజల్ని దోచుకునే ముఠా కూడా పుట్టుకొచ్చింది. ఇప్పటి వరకూ ఆక్సీ మీటర్ల రేట్లను అడ్డగోలుగా పెంచేసి దోచుకునేవారినే చూశాం. ఇప్పుడో కొత్త గ్యాంగ్ ఏకంగా బ్యాంక్ ఖాతాలే టార్గెట్ గా ఆక్సీమీటర్లతో మాయ చేసేస్తోంది.


సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఆక్సీమీటర్ల పేరుతో అమాయకులపై వల విసురుతున్నారు. ఆన్ లైన్లో ఆక్సీ మీటర్ అమ్మకం పేరుతో ప్రకటనలు ఉంచుతారు. అంతే కాదు, అది చెడిపోతే వెంటనే రీప్లేస్ మెంట్ ఇస్తామని కూడా హామీ ఇస్తారు. ఇంకేముంది రీప్లేస్ మెంట్ హామీ ఉంది కాబట్టి చాలామంది ఆ ప్రకటనకి ఆకర్షితులై వెంటనే ఆక్సీమీటర్లకు ఆర్డర్ ఇచ్చేస్తున్నారు.


అయితే ఇక్కడే చిన్న మతలబు ఉంది. అలా ఇచ్చే పరికరంలో ఓ చిన్న మెమరీ కార్డ్ అమర్చుతున్నారు కేటుగాళ్లు. మనం వేసే వేలిముద్రల డేటా అంతా అందులో రికార్డ్ అయ్యేలా చేస్తారు. నాసిరకం ఆక్సీ మీటర్ ఎలాగూ నాలుగైదు వారాల్లో చెడిపోతుంది కాబట్టి, దాన్ని వెనక్కి ఇచ్చేసి కొత్తది తీసుకోవాలనుకుంటారు వినియోగదారులు. ఇలా తిరిగిచ్చేసిన ఆక్సీ మీటర్ల ద్వారా మన వేలిముద్రలు మోసగాళ్ల దగ్గరకు చేరతాయి. ఆక్సీ మీటర్ లో ఉన్న చిప్ ద్వారా వేలిముద్రల డేటా మోసగాళ్లకు తెలిసిపోతుంది.


మన వేలిముద్రల ద్వారా ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్ సాయంతో బ్యాంక్ అకౌంట్ డిటెయిల్స్ తీసుకుని, ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. డార్క్‌ నెట్‌ లేదా ఇతర వ్యక్తుల ద్వారా సిమ్‌ కార్డు డేటాను తీసుకుంటారు. ఆ డేటాలో మన వేలు ముద్రలను బట్టి మన ఫోన్‌ నంబర్లను సేకరిస్తారు. లేదా మన ఆధార్‌ సమాచారం తీసుకుంటారు. వీటి ద్వారా వారికి మన బ్యాంక్‌ ఖాతాల వివరాలు తెలిసిపోతాయి. అలా వారు బ్యాంక్‌ ఖాతాలను విశ్లేషించి వాటి ద్వారా డబ్బును దోచేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఇటీవల కాలంలో ఇలా ఆన్‌ లైన్‌ లో ఆక్సిమీటర్లు కొనుగోలుచేసిన వారి బ్యాంకుల్లో డబ్బులు మాయం అయినట్టు చెబుతున్నారు. అయితే అధికారికంగా ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు కాబట్టి ఈ తరహా కేసులు ఇంకా బయటపడలేదు. ఆక్సీమీటర్ల పేరుతో సైబర్ మోసగాళ్ల వలలో పడకూడదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.


No comments

Powered by Blogger.