Latest

Loading...

Lock down పశ్చిమబెంగాల్లో జూలై 1 వరకూ లాక్‌డౌన్ ఆంక్షల పొడిగింపు...!



 కోవిడ్ లాక్‌డౌన్ ఆంక్షలను జూలై 1వ తేదీ వరకూ పశ్చిమబెంగాల్ ప్రభుత్వం పొడిగించింది. ఈమేరకు మార్గదర్శకాలను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ఆ ప్రకారం, ప్రభుత్వ కార్యాలయాలన్నీ 25 శాతం సామర్థ్యంతో పని చేస్తాయి. ప్రైవేటు, కార్పొరేట్ కార్యాలయాలు 25 శాతం సిబ్బందితో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకూ పనిచేస్తాయి. రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకూ ప్రజల రాకపోకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయి.


రెస్టారెంట్లు, బార్లు మధ్నాహ్నం 12 నుంచి రాత్రి 8 వరకూ 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో తెరిచి ఉంచుతారు. సెలూన్లు, స్పాలు, బ్యూటీ పార్లర్లు, సినిమాహాళ్లు, స్విమ్మింగ్ పూల్స్ వంటివి తదుపరి ఉత్తర్వు వరకూ మూసే ఉంటాయి.

రాజకీయ, పబ్లిక్ సమావేశాలను రద్దు చేశారు. పెళ్లిళ్లకు 50 మందిని, అంత్యక్రియలకు 20 మందిని మాత్రమే అనుమతిస్తారు. మార్కెట్లు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 11 వరకూ తెరిచి ఉంచుతారు. బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ తెరిచి ఉంటాయి. ఈ-కామర్స్, ఫుడ్ డెలివరీ సర్వీసులు యథాప్రకారం పనిచేస్తాయి. షాపింగ్ మాల్స్‌లోని షాపులు, షాపింగ్ కాంప్లెక్స్‌కు 50 శాతం సిబ్బందితో మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ తెరుచుకోవచ్చు. విద్యాసంస్థలు మూసే ఉంటాయి. అత్యవసరాల్లో మినహాయించి ప్రైవేటు వాహనాల రాకపోకలు రద్దు చేశారు.


కాగా, పశ్చిమబెంగాల్‌లో కొత్తగా 3,984 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 84 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 16,896కు చేరింది. నార్త్ పరగణాల జిల్లాలో అత్యధికంగా 597 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, కోల్‌కతాలో 426 మరణాలు చోటుచేసుకున్నాయి.

No comments

Powered by Blogger.