NPS Withdrawal: ఎన్పీఎస్ చందాదారులకు గుడ్‌న్యూస్.. ఒకేసారి రూ. 5 లక్షలు విత్‌డ్రా చేసుకునే అవకాశం...!
నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో చేరిన వారికి మోదీ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. వారి పీఎఫ్ విత్‌డ్రా లిమిట్ పెంచుతూ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పిఎఫ్ఆర్డిఎ) నిర్ణయం తీసుకుంది. తద్వారా పెన్షనర్లు, తమ పెన్షన్ కార్పస్ ఫండ్‌ను ఒకేసారి విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇది ఎంతో మంది పెన్షనర్లకు ఊరట కలిగించే అంశంగా చెప్పవచ్చు. తాజా నిర్ణయం ప్రకారం, చందాదారుల పెన్షన్ కార్పస్ ఫండ్ రూ. 5 లక్షల వరకు ఉంటే.. ఆ మొత్తాన్ని ఒకేసారి విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. వారు యాన్యుటీలు కొనుగోలు చేయకుండానే ఈ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకు పీఎఫ్ఆర్డిఏ చందాదారులను అనుమతించింది.
ప్రస్తుత నిబంధనల ప్రకారం, పదవీ విరమణ సమయంలో లేదా 60 ఏళ్లు నిండిన తర్వాత చందాదారులు పెన్షన్ కార్పస్ నుంచి ఒకేసారి రూ. 2లక్షల కంటే ఎక్కువ తీసుకునే వీలులేదు. ఈ పరిమితి దాటిన తర్వాత పెన్షనర్లు తమ కాంట్రిబ్యూషన్లో 60 శాతం మాత్రమే విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉండేది. మిగిలిన 40 శాతంతో బీమా సంస్థలు ఆఫర్ చేసే యాన్యుటీ ప్లాన్లలో పెట్టుబడి పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ నియమాన్ని తొలగిస్తూ చందాదారులకు పెద్ద ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. అంటే, ఎటువంటి యాన్యుటీని కొనుగోలు చేయకుండానే ఇకపై రూ. 5 లక్షల వరకు పెన్షన్ కార్పస్ ఫండ్‌ను ఉపసంహరించుకోవచ్చు.
దీనితో పాటు, ఏక మొత్తంలో చేసే ఎన్పీఎస్ ముందస్తు విత్‌డ్రా లిమిట్‌ను కూడా రూ. 2.5 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. కాగా, గతంలో ఈ పరిమితి రూ. 1 లక్ష వరకు మాత్రమే ఉండేది. ఇక, తాజా నిర్ణయంతో చందాదారుడి పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్లో జమ అయిన మొత్తం రూ. 5 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉన్నట్లైతే వారు ఎటువంటి యాన్యుటీ కొనుగోలు చేయకుండానే ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఇక, రెగ్యులేటర్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పిఎస్) ప్రవేశ వయస్సును గరిష్టంగా 65 నుంచి 75 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. అంటే, ఇకపై 70 సవంత్సరాల వయస్సులోనూ ఎన్పీఎస్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. పదవీ విరమణ అనంతరం ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవించడానికి ఈ ఎన్పీఎస్ పథకంలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇందులో చేరిన వారికి ప్రతి నెలా పెన్షన్ లభిస్తుంది.
No comments