Online classes :ప్రత్యక్ష తరగతులు ఇప్పుడే కాదు...!!
1 నుంచి 3-10 విద్యార్థులకు టీవీ పాఠాలు
ఇంటర్‌లోనూ ఆన్లైన్ తరగతులే
ఇతర రాష్ట్రాలను బట్టే తెలంగాణలో నిర్ణయం
రాష్ట్రంలో జులై ఒకటి నుంచి పాఠశాలల్లో ఆన్లైన్, ఆఫ్‌లైన్ తరగతులు జరుపుతామని హైకోర్టుకు స్పష్టంచేసిన ప్రభుత్వం.. ప్రస్తుతానికి కేవలం ఆన్లైన్ పాఠాలకే పరిమితం కావాలన్న నిర్ణయానికి వచ్చింది. పాఠశాలలతో పాటు జూనియర్ కళాశాలల్లోనూ ప్రత్యక్ష తరగతులను వాయిదా వేయాలని నిర్ణయించింది. తదనుగుణంగానే విద్యాశాఖ అధికారులు మార్గదర్శకాల రూపకల్పనకు సమాయత్తమవుతున్నారు.
పీఆర్టీయూటీఎస్ నేతలు శనివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి భౌతిక తరగతులను తాత్కాలికంగా వాయిదా వేయాలని విన్నవించారు. ఈ సందర్భంగా 'మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడా ప్రత్యక్ష తరగతులు ప్రారంభించలేదు కదా? తొందర ఎందుకు?'.. అని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలిసింది. దానికి తోడు ప్రత్యక్ష తరగతులు జరపాలంటే వసతిగృహాలు తెరవాల్సి ఉండటం వంటి చిక్కులతో ప్రస్తుతానికి ఆన్లైన్ పాఠాలకే పరిమితం కావాలని విద్యాశాఖను ఆదేశించినట్లు సమాచారం. కేంద్ర విద్యాశాఖ సైతం ఇప్పటికీ కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాలు, సీబీఎస్ఈ అనుబంధ ప్రైవేట్ పాఠశాలల అకడమిక్ క్యాలెండర్, ప్రత్యక్ష తరగతులపై ఎలాంటి మార్గదర్శకాలు, ఆదేశాలు ఇవ్వలేదు. తాజా పరిస్థితుల నేపథ్యంలో మార్గదర్శకాలు వెలువడవచ్చని, అంతేకాక ఇతర రాష్ట్రాలు ఏం చేస్తున్నాయో గమనించి ఆ ప్రకారం ముందుకు వెళ్లాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. సర్కారు ఆదేశాల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ అధికారులు ఆన్లైన్ తరగతులకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కనీసం జులై వరకు తరగతి గది బోధన ఉండకపోవచ్చని విద్యాశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆగస్టులో ఉంటాయా? ఉండవా? అనేది ఇప్పుడే చెప్పలేమంటున్నాయి. మరోవైపు జులై ఒకటి నుంచి ప్రత్యక్ష, ఆన్లైన్ తరగతులు జరపాలని ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్ మార్గదర్శకాలు ఇవ్వడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆగ్రహించినట్లు సమాచారం. తాను కేవలం 'ఉండొచ్చు' అని మాత్రమే ఆదేశాలు ఇచ్చామని ఆయన వివరణ ఇచ్చుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఇంటర్‌బోర్డు వెబ్సైట్లో ఉంచిన మార్గదర్శకాలను తొలగించినట్లు చెబుతున్నారు. 'ఇంటర్లో కనీసం 30 శాతం మంది రెసిడెన్షియల్ విధానంలో చదువుకుంటుంటారు. ప్రత్యక్ష తరగతులంటే హాస్టళ్లలో ఉండాలి. టీకాలు తీసుకోకుండా ప్రత్యక్ష తరగతులకు వెళ్లడం క్షేమం కాదు. పకడ్బందీగా ఆన్లైన్ పాఠాలను ప్రారంభించడం అన్ని విధాలా శ్రేయస్కరం' అని ఇంటర్ విద్యా ఐకాస ఛైర్మన్ డాక్టర్ పి.మధుసూదన్‌రెడ్డి సూచించారు.
ఒకేసారి 3-10 తరగతులకు...
కేవలం ఆన్లైన్ తరగతులే కావడంతో మూడు నుంచి పదో తరగతి వరకు ఆన్లైన్ పాఠాలను ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. దూరదర్శన్, టీశాట్ ద్వారా ముందుగా రికార్డు చేసిన పాఠాలను ప్రసారం చేయనున్నారు.
No comments