Weight Loss Tips: రాత్రి 8 గంటల తర్వాత భోజనం చేస్తే ఏమవుతుంది ?.. వాస్తవం ఏంటో తెలుసుకోండీలా...!
అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న శరీర బరువు ఇప్పుడు అందరికీ పెద్ద సమస్యగా మారింది. దీనికి చెక్ పెట్టేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోంది. అయితే, ఎక్కువ మంది ఊబకాయం బారిన పడటానికి అనేక కారణాలున్నాయి. తీసుకునే ఆహారం మీద అస్సలు శ్రద్ధ చూపకపోవడం, సమయానికి సరిగ్గా తినక పోవడం వంటివి దీనికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. అయితే, అధిక బరువు విషయంలో అనేక అపోహలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా రాత్రి 8 గంటల తర్వాత భోజనం చేస్తే త్వరగా బరువు పెరుగుతారనే అపోహ చాలా మందిలో ఉంది. రాత్రి ఆలస్యంగా తింటే నిజంగానే బరువు పెరుగుతారా? లేదా ఇందతా ఫేక్ ప్రచారమేనా? అనే విషయంపై పరిశోధకులు అధ్యయనం చేశారు. వారి అధ్యయనంలో ఆసక్తికర విషయం బయటపడింది.
అసలు భోజనం చేసే సమయం, బరువు పెరగడానికి మధ్య ఎటువంటి సంబంధం లేదని పరిశోధకులు తేల్చి చెప్పారు.
అధ్యయనంలో వెలుగు చూసిన విషయాలు..
లండన్ కింగ్స్ కాలేజీకి చెందిన పరిశోధకుల బృందం 2008, 2012 మధ్య 1500 మందికి పైగా పిల్లల ఆహారపు అలవాట్లను పరిశీలించింది. ఈ డేటాను యూకేలోని నేషనల్ డైట్ అండ్ న్యూట్రిషన్ సర్వే రోలింగ్ ప్రోగ్రాం నుంచి సేకరించారు. ఈ అధ్యయన ఫలితాలను బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురించారు. రాత్రి ఆలస్యంగా భోజనం చేసే పిల్లల్లో అధిక బరువు లేదా ఊబకాయం సమస్యలను తెలుసుకునేందుకు ఈ అధ్యయనం నిర్వహించారు. అయితే, అర్ధరాత్రి భోజనం చేయడానికి, బరువు పెరగడానికి ఎలాంటి సంబంధం లేదని వారి అధ్యయనంలో వెల్లడైంది.
రాత్రి ఆలస్యంగా తినడం అనారోగ్యంగా ఎందుకు భావిస్తారు?
రాత్రి వేళ ఆలస్యంగా తింటే బరువు పెరుగుతారన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. దీనిలో వాస్తవం లేదు. కాకపోతే, రాత్రి తినే ఆహార పదార్థాల వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. రాత్రి తీపి ఎక్కువగా ఉండే స్వీట్స్, కార్బోనేటేడ్ డ్రింక్స్ తీసుకుంటాం. అదేవిధంగా సాల్ట్ ఎక్కువగా ఉండే స్నాక్స్ కూడా తింటుంటాం. వీటిలో కేలరీలు అధికంగా ఉంటాయి. ఇవి సహజంగానే బరువు పెరగడానికి దోహదం చేస్తాయి. అలాగే, ఒత్తిడి, విసుగు, ఆందోళన నుంచి బయటపడటానికి కొంతమంది రాత్రిళ్లు ఎక్కువ మోతాదులో భోజనం చేస్తుంటారు. తద్వారా ఊబకాయం సమస్య బారిన పడతారు.
రాత్రిపూట ఎక్కువ భోజనం తింటే కలిగే నష్టాలు
రాత్రిపూట ఎక్కువ ఆహారం తినడం వల్ల బరువు పెరగడమే కాకుండా, అనేక ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా, నిద్రకు ముందు ఆహారం తినడం వల్ల అజీర్తి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. తద్వారా మీ నిద్రకు భంగం వాటిల్లుతుంది. అందువల్ల, బరువు తగ్గాలనుకునే వారు రాత్రి పూట తినకపోయినా ఫర్వాలేదని పరిశోధకులు చెబుతున్నారు. కేవలం, పడుకునే రెండు గంటల ముందు భోజనం చేయడం మంచిదని చెబుతున్నారు. అంతేకాక, ఊబకాయ సమస్య రావొద్దంటే మీ రోజూవారి కేలరీలు ట్రాక్ చేసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, కంటి నిండా నిద్ర పోవాలని సూచిస్తున్నారు.
No comments