AP News ఏపీ మహిళలకు గుడ్ న్యూస్...!!
మహిళలకు శాశ్వత ఉపాధిని అందించడం కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపార అవకాశాల్లో మహిళలకు తోడ్పాటు అందించడం కోసం మరో 14 కార్పొరేట్ సంస్థలు, ఎన్‌జీవోలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది.
వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాల ద్వారా మహిళలకు నగదు అందించి, వ్యాపార మార్గాల్లో పెట్టుబడికి వినియోగించుకునే అవకాశం కల్పిస్తూ.. ఈ ఏడాది కనీసం 6 లక్షల మహిళల కుటుంబాలకు శాశ్వత జీవనోపాధులు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మహిళలు చేతివృత్తుల ద్వారా తయారు చేసే బొమ్మలు, ఇతర వస్తువులు, రెడీమెడ్ దుస్తుల విక్రయానికి ఈ-కామర్స్ సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడం ద్వారా ఆన్‌లైన్ మార్కెట్‌లో అవకాశాలు కల్పిస్తారు.
అంతేకాకుండా ఆధునిక వ్యవసాయ పద్ధతులపై శిక్షణ, వసతుల కల్పన ద్వారా వ్యవసాయ, ఉద్యాన రంగాల్లోనూ లాభదాయకత పెంచడం వంటి చర్యలపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది.
అజియో బిజినెస్ సంస్థతో ఒప్పందం ద్వారా 90 వేల మంది మహిళలకు శాశ్వత ఉపాధి కల్పించాలనేది ప్రభుత్వం ప్రాథమిక లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్‌ఐ-ఎంఎస్‌ఎంఈ సంస్థ ద్వారా కుటీర పరిశ్రమల ఏర్పాటులోనూ మహిళలకు తోడ్పాటు అందించనున్నారు. ఈ సంస్థ తోడ్పాటుతో 1,300 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.
No comments