Corona గుండెపై కరోనా కాటు..!!
కరోనా నుంచి కోలుకున్నవారిలో హృద్రోగ ముప్పు
దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారికే అధికం
కరోనా వైరస్ శరీరానికి ఎంత నష్టం చేయాలో అంత చేసేసింది. దాని ప్రభావంతో ఒంట్లోని అవయవాలు ఒక్కొక్కటి ఒక్కోరకంగా దెబ్బతిన్నాయి. మెదడు నుంచి అరికాళ్ల దాకా అన్నీ వైరస్ దాడిలో నష్టపోయినవే. అందులోనూ గుండెకు జరిగే చేటు ఎక్కువేనంటున్నారు శాస్త్రవేత్తలు. వైరస్ నుంచి కోలుకొన్నా దాని తీవ్రతతో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని చెప్తున్నారు.
కరోనా నుంచి కోలుకున్నవారికి గుండెపోటు ముప్పు పొంచి ఉన్నదని నిపుణులు చెప్తున్నారు.
ఇందుకు కర్ణాటకలో ఇటీవల జరిపిన ఓ అధ్యయన ఫలితాలను ఉదాహరణగా చూపిస్తున్నారు. బెంగళూరులో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే శ్రీజయదేవ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సైన్సెస్ అండ్ రిసెర్చ్‌లో గత నెల కరోనా చికిత్స పొంది కోలుకున్నవారిలో 26 మందికి గుండెపోటు వచ్చినట్టు తేలింది. బాధితుల్లో అన్ని వయసుల వారు ఉన్నారు. అందులో 9 మంది మహిళలు ఉన్నారు. ఇద్దరు 30 ఏండ్లలోపువారు కాగా, 31-40 ఏండ్ల వయస్కులు ఆరుగురు, 41-50 ఏండ్ల వయస్కులు ఆరుగులు, 51-60 ఏండ్ల వయస్కులు ఏడుగురు ఉన్నారు. మిగతా ఐదుగురు 60 ఏండ్లకు పైబడినవారు. ఇందులో 20 మంది సాధారణ చికిత్సతో బయటపడగా, ఆరుగురికి మాత్రం ఆంజియోప్లాస్టీ, బైపాస్ సర్జరీ చేయాల్సి వచ్చింది. దీనిని బట్టి కరోనా నుంచి కోలుకున్న తర్వాత కనీసం 2-3 నెలలపాటు గుండె పనితీరుపై కచ్చితంగా నిఘా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికే ముప్పు ప్రమాదం ఎక్కువగా ఉన్నదని చెప్తున్నారు.
వైరస్ నుంచి కోలుకొన్నాక పౌష్ఠికాహారం తీసుకోవటం, వ్యాయామం చేయటం, మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవటం వల్ల గుండెపోటు బారి నుంచి కాపాడుకోవచ్చని పేర్కొంటున్నారు. గుండెపోటు వచ్చాక వీలైనంత త్వరగా కార్డియో పల్మనరీ రిససిటేషన్(సీపీఆర్) చేస్తే కోలుకొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని రిససిటేషన్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ విజయ్‌రావు తెలిపారు. ఆపదలో ఉన్న వ్యక్తి ఛాతిపై రెండు చేతులు ఉంచి బలంగా, వేగంగా కనీసం 30 సార్లు ఒత్తాలని, దీంతో గుండెకు రక్తసరఫరా పునరుద్ధరణ జరుగుతుందని వెల్లడించారు.
ఎందుకిలా జరుగుతున్నది...?
1) వైరస్ ఒంట్లోకి చేరాక రక్తంలోని రోగ నిరోధక వ్యవస్థతో ఘర్షణకు దిగుతుంది. ఈ క్రమంలో రక్తనాళాలు, గుండె గదుల్లోని లోపలి పొరలో కండరాలు ధ్వంసం అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో రక్త ప్రసరణ వేగం మారుతుంది
2) కరోనా వైరస్ విడుదల చేసే విషపదార్థం వల్ల రక్తం గడ్డకట్టే అవకాశం ఉన్నది
3) ఊపిరితిత్తుల్లోని ఒకటి కంటే ఎక్కువ ధమనులు రక్తం గడ్డలతో మూసుకుపోవడం వల్ల
4) వంశపారంపర్యంగా గుండెపోటు సమస్య ఉన్నవారికి
5) షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక రోగులకు
6) అనవసరమైన ఆలోచనలు, ఆందోళనతో గుండె కొట్టుకొనే వేగం 100కు పైగా పెరిగి, గుండెపోటుకు దారితీయవచ్చు.
No comments