KCR 50 వేల ఉద్యోగాల భర్తీకి కార్యాచరణ...
ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవ శుభాకాంక్షలు
హైదరాబాద్: రాష్ట్రంలో మరో 50 వేల ఉద్యోగాల భర్తీకి కార్యాచరణ మొదలైందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో 1.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని, ఇకపై వార్షిక కేలండర్ ద్వారా కొత్త ఉద్యోగ నియామకాలను చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా యువతకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇచ్చిన సందేశంలో ప్రైవేటు రంగంలో విస్తృతంగా ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
స్వరాష్ట్ర ఫలాలను వర్తమాన, భవిష్యత్ యువతకు పూర్తి స్థాయిలో అందించేలా రాష్ట్రప్రభుత్వం తెలంగాణను తీర్చిదిద్దుతోందని చెప్పారు. యువతీయువకులకు ఉద్యోగ, ఉపాధి కల్పనే ధ్యేయంగా ఏడేళ్లుగా అమలు చేస్తున్న కొత్త జోనల్ విధానం కార్యాచరణ కొలిక్కి వచ్చిందన్నారు. వారు స్వరాష్ట్ర ఫలాలు అనుభవించే పరిస్థితులు ఇపుడు తెలంగాణలో నెలకొన్నాయని సీఎం వివరించారు.
యువత నైపుణ్యం పెంపొందించుకోవాలి
''సకల జనజీవనం గుణాత్మకంగా అభివృద్ధి చెందిననాడే నిజమైన అభివృద్ధి అని ప్రభుత్వం విశ్వసించింది. ఈమేరకు ప్రాధాన్య క్రమంలో చర్యలు చేపట్టింది. పలు పథకాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాం. పారిశ్రామిక, వాణిజ్య, ఐటీరంగాలు సహా వ్యవసాయం, అనుబంధ రంగాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. లక్షలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. మారిన పరిస్థితుల్లో యువత సమర్థంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. నైపుణ్యాల పెంపునకు ప్రభుత్వం కృషి చేస్తోంది. వివిధ రంగాల్లో ఉద్యోగాలు లభించేలా దేశంలోనే తొలిసారిగా టాస్క్ ఏర్పాటు చేసింది. డిగ్రీ తర్వాత యువతకు సాంకేతిక, సాంకేతికేతర పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా శిక్షణ ఇస్తున్నాం. వారిని ప్రోత్సహించేలా పారిశ్రామిక, ఐటీ, ఆహారశుద్ధి విధానాలను రూపొందించాం. టీసాట్ ద్వారా నిరుద్యోగులకు వివిధ స్థాయుల్లో అవగాహనతో పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం'' అని కేసీఆర్ పేర్కొన్నారు.
No comments