Latest

Loading...

Phone hacked మీ సెల్‌ఫోన్ హ్యాక్ అయిందని తెలుసుకోవడం ఎలా... హ్యాక్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి...?

Phone hacked

 మీ ఫోన్ బ్యాటరీ చాలా తొందరగా అయిపోతుందా.. ఫోన్‌లో బ్రౌజింగ్ డాటా ఇట్టే అయిపోతుందా?


ఇది ఫోన్ బ్యాటరీ సామర్థ్యం తగ్గడం వల్లో, మీ వాడకం పెరగడం వల్లో మాత్రమే కాదు హ్యాకర్ల పని కూడా కావొచ్చు.


మీకు తెలియకుండా సైబర్ దుండగులు మీ ఫోన్‌ను తమ అధీనంలోకి తీసుకుని ఉండొచ్చు.


అదే కనుక నిజమైతే మీ ప్రైవసీ, విలువైన సమాచారం అన్నీ ముప్పు ముంగిట ఉన్నట్లే.


మరి, ఫోన్ హ్యాకింగ్‌కు గురైందో లేదో తెలుసుకోవడం ఎలా? హ్యాక్ కాకుండా ముందే జాగ్రత్త పడడం ఎలా?

సాధారణంగా కంటే చాలా ఎక్కువగా బ్రౌజింగ్ డాటా ఖర్చయిపోతుంటే అనుమానించాల్సిందే.


''మీ ఫోన్ వినియోగం ఎప్పటిలాగే ఉన్నప్పటికీ బ్రౌజింగ్ డాటా చాలా వేగంగా అయిపోతుంటే ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉంది'' అని అమెరికా కంప్యూటర్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ సంస్థ నార్టన్ చెబుతోంది.


ఈ మార్పును గుర్తించిన సమయంలోనే ఫోన్ బ్యాటరీ కూడా తొందరగా అయిపోతుండడాన్ని గుర్తిస్తే హ్యాక్ అయినట్లు అనుమానించాల్సిందేనని నార్టన్ చెబుతోంది.


మరో సంస్థ 'కాస్పరెస్కీ' మరో ముఖ్యమైన విషయం చెప్పింది. సైబర్ నేరగాళ్లు మీ ఫోన్‌ను హ్యాక్ చేసి ఏదైనా అప్లికేషన్లను చొప్పించినట్లయితే ఆ అప్లికేషన్ నడవడానికి మీ ఫోన్ ప్రాసెసింగ్ పవర్ పనిచేస్తుందని.. అందువల్ల ఫోన్ వేగం పూర్తిగా తగ్గిపోతుందని కాస్పరెస్కీ చెబుతోంది.


కాబట్టి ఫోన్ వేగం తగ్గినా కూడా హ్యాకయినట్లు అనుమానించాల్సిందే.


మీ మెయిల్ కానీ, సోషల్ మీడియా అకౌంట్లను కానీ మీకు సంబంధం లేని లొకేషన్ల నుంచి ఎవరైనా యాక్సెస్ చేయడానికి ప్రయత్నించినట్లు గుర్తిస్తే వెంటనే అప్రమత్తం కావాలని నార్టన్, కాస్పరెస్కీ సంస్థలు చెబుతున్నాయి.

మీ డాటా హ్యాకర్ల చేతిలో పడకూడదంటే ఏం చేయాలి?


ఇంటర్నెట్, యాప్స్ వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా యాప్స్ ఏవి పడితే అవి డౌన్‌లోడ్ చేయరాదు. గూగుల్, యాపిల్ ప్లే స్టోర్ల నుంచే యాప్స్ డౌన్ చేసుకోవడం చాలావరకు సురక్షితం.


అపరిచితుల నుంచి వచ్చే మెయిల్స్, మెసేజీలలో ఉండే లింకులను క్లిక్ చేయొద్దు. అటాచ్‌మెంట్లు డౌన్‌లోడ్ చేయొద్దు. వాటిలో మాల్‌వేర్ ఉండే ప్రమాదం ఉంది.


''వైఫై, బ్లూటూత్ ద్వారా హ్యాక్ చేయడం సైబర్ నేరగాళ్లకు చాలా సులభం. కాబట్టి అవసరం లేని సమయాలలో ఆ రెండూ ఆఫ్ చేయడం మంచిద''ని మెకఫీ సంస్థ సూచిస్తోంది.


ఫోన్‌లో అప్లికేషన్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం, ఫోన్‌ను ఇతరులకు ఇవ్వకపోవడం వల్ల చాలావరకు హ్యాక్ కాకుండా కాపాడుకునే అవకాశం ఉంటుందని కాస్పరెస్కీ చెబుతోంది.


బహిరంగ ప్రదేశాలు, రద్దీ ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఫోన్ అవసరం లేకపోతే స్విచాఫ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

రద్దీ ప్రదేశాలలో ఫోన్ స్విచాఫ్ చేయడం మంచిది

హ్యాక్ అయినట్లు నిర్ధరణ అయితే ఏం చేయాలి?


మీ ఫోన్ హ్యాక్ అయినట్లు తెలుసుకున్న వెంటనే అందులో ఉన్న కాంటాక్ట్స్ అందరికీ సమాచారం ఇవ్వాలి. మీ నుంచి వచ్చే మెయిళ్లు, మెసేజీల్లో ఉండే లింకులను క్లిక్ చేయొద్దని చెప్పాలి.


అనుమానం కలిగించే అప్లికేషన్ ఏదైనా ఉంటే దాన్ని వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయాలి.


వేరే డివైస్ నుంచి లాగిన్ అయి మెయిల్, సోషల్ మీడియా ఖాతాల పాస్‌వర్డ్స్ మార్చుకోవాలి.


అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే ఫోన్ రీసెట్ చేసుకోవాలి.


No comments

Powered by Blogger.