Sleep for Health : మనిషికి రోజుకు ఎన్నిగంటల నిద్ర అవసరం..?
Sleep for Health : మనిషి జీవితంలో నిద్ర అనేది ఒక బాగం..శరీరపరంగా దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. ఆరోగ్య రిత్యా మనిషి తప్పనిసరిగా నిద్రపోవాల్సి ఉంటుంది. మానసిక వికాసానికి నిద్ర ఎంతగానో దోహదం చేస్తుంది. నిద్ర పోయే విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే నిద్రలేమి కారణంగా అనేక రకాల జబ్బుల భారిన పడే అవకాశాలు ఉన్నాయట. హర్మోన్ల ఉత్పత్తి, నియంత్రణ మనం నిద్రపోయే సమయంపైనే అధారపడి ఉంటాయి. నిద్రవల్ల మెదడు పునరుత్తేజం పొంది చాలా చురుకుగా పనిచేస్తుందని పలు పరిశోధనల్లో తేలింది.
ఆరోగ్యం కోసం నిద్ర అత్యవసరమని వైద్య నిపుణులు చెప్తున్నారు. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నిద్ర విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యెద్దని ఇప్పటికే సూచించింది.
ఇటీవలి కాలంలో మారిన జీవన విధానాల కారణంగా నిద్రకు చాలా తక్కువ సమయాన్ని కేటాయించటం పరిపాటిగా మారింది. నిద్రసమయంలో సైతం సెల్ ఫోన్ లు, టివి లు, కంప్యూటర్లు ఇతరత్రా వ్యాపకాలతో చాలా మంది గడిపేస్తున్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. దీని వల్ల ఆరోగ్య పరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం అధికంగా ఉంటుంది.
సరైన నిద్రలేకపోవటం వల్ల బరువు పెరగటం, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవటం, బిపి, గుండెజబ్బులు, హైపర్ టెన్షన్, మతిమరుపు వంటి సమస్యలు తీవ్రతరమై చివరకు మరణానికి దారితీసే అకాశాలు ఉన్నాయి. నిద్ర పోవటాన్ని నిర్లక్ష్యం చేస్తే రోగాలతోకూడిన చావును కొనితెచ్చుకున్నట్లే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వయస్సుల వారిగా ఎవరు ఎంత సమయం నిద్ర పోవాలన్న దానిపై కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. అవేంటో పరిశీలిస్తే…
అప్పుడే పుట్టిన పురిటి బిడ్డలు రోజుకు 15గంటల నుండి 18గంటలు నిద్రపోవాలి. ఒకటి నుండి 3 సంవత్సరాలోపు వారు 12 నుండి 15 గంటలు నిద్రపోవాలి. 3సంవత్సరాల నుండి 5సంవత్సరాల వయస్సు కలిగిన వారు 11 గంటల నుండి 15గంటలు నిద్రపోవాలి. 5సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వయస్సు వారు 9 నుండి 11 గంటలు నిద్రపోవాలి. 13 సంవత్సరాల నుండి 17 సంవత్సరాల వయస్సు వారు 8గంటల నుండి 10గంటలు నిద్రపోవాలి. 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వయస్సు వారు 7 నుండి 9గంటల సమయం నిద్రపోవాలి. 26సంవత్సరాల నుండి 64 సంవత్సరాల వరకు 7 నుండి 9గంటల పాటు నిద్రపోవాలి. నిద్రకోసం తగినంత సమయాన్ని కేటాయిస్తే ఆరోగ్యంగా జీవించ వచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
No comments