Latest

Loading...

Telangana: తెలంగాణ రైతులకు శుభవార్త.....50 వేల రూపాయల వరకు రుణమాఫి..!!

Telangana

 తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పేద ప్రజలకు వరుసగా వరాల జల్లు కురుపిస్తూనే ఉన్నారు సీఎం కేసీఆర్.. అయితే ఇవన్నీ హుజారాబాద్ ఎన్నికల స్టంటే అంటున్నాయి విపక్షాలు.. కారణం ఏదైనా సీఎం కేసీఆర్ చాలా స్పీడ్ పెంచారు. దీనిలో భాగంగా ఎన్నికల హామీ మేరకు ఇప్పటివరకు 25 వేల రూపాయల లోపు పంట రుణాలను మాఫీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ ప్రక్రియను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి నెలాఖరులోగా 50 వేల వరకున్న పంట రుణాలను మాఫీ చేయాలని మంత్రివర్గం ఆదేశించింది. రాష్ట్ర ఆర్థిక శాఖ అందించిన వివరాల ప్రకారం 6 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. 25 వేల వరకూ ప్రభుత్వ మాఫీతో ఇప్పటికే 3 లక్షల పై చిలుకు రైతులు ప్రయోజనం పొందగా, తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఈ సంఖ్య 9 లక్షలకు పెరగనుంది.


మిగతా రుణమాఫీ ప్రక్రియ కూడా దశలవారీగా కొనసాగించాలని తెలంగాణ కేబినెట్‌ నిర్ణయించింది.


దీంతో పాటు 8 లక్షల లోపు వార్షిక ఆదాయం గల అగ్ర కుల పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ కోటాను వర్తింప జేయాలని నిర్ణయించింది. ఈ కోటాలో భర్తీ చేసే ఉద్యోగాల గరిష్ట వయో పరిమితిని 5 ఏళ్లు పెంచాలని కూడా నిర్ణయించింది. సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆదివారం ప్రగతిభవన్‌లో ఆరున్నర గంటలకు పైగా సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దళిత బంధు పథకం అమలు, విధివిధానాల రూపకల్పనపై కేబినెట్‌ విస్తృతంగా చర్చించింది. పైలట్‌ ప్రాజెక్టు అమలుకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేరుస్తూ ముందుకు సాగుతోందని, ఫలితాలు ప్రజల అనుభవంలో ఉన్నాయని సీఎం కేసీఆర్‌ అన్నారు.


అలాగే దళిత బంధు పథకం అమలు విషయంలో మంత్రివర్గ సహచరుల నుంచి సీఎం సూచనలు స్వీకరించారు. రెక్కల కష్టం తప్ప మరే ఆస్తి లేని దీనస్థితిలో దళిత ప్రజలు ఉన్నారని, రాష్ట్రంలో 20 శాతం జనాభా ఉన్న దళితుల చేతుల్లో ఉన్న సాగుభూమి కేవలం 13 లక్షల ఎకరాలేనని, వారి పేదరికానికి ఇంతకు మించిన గీటురాయి లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ విషయంలో గిరిజనుల కన్నా దయనీయ పరిస్థితుల్లో దళితులు ఉన్నారని తెలిపారు. అరకొర సహాయాలతో దళితుల అభివృద్ధి సాధ్యం కాదని, అందుకే దళితబంధులో ఒక యూనిట్‌ పెట్టుకోవడానికి రూ.10 లక్షల పెద్దమొత్తం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. బ్యాంకు రుణాలతో ముడి పెట్టుకోలేదని, తిరిగి చెల్లించే భారం ఉంటే దళితుల ఆర్థిక స్థితిలో మెరుగుదల రాదని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ పథకానికి చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించారు. దళిత బంధు దేశానికి దారి చూపే పథకం అవుతుందని కేబినెట్‌ అభిప్రాయ పడింది.


దళిత బంధు లబ్ధిదారుడు ఎంచుకున్న ఉపాధిని అనుసరించి సంబంధిత ప్రభుత్వ శాఖ శిక్షణ కల్పించాలని మంత్రివర్గం కోరింది. శిక్షణ, పర్యవేక్షణకు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ వివిధ శాఖల అధికారులతో, గ్రామంలోని చైతన్యవంతులైన వారి భాగస్వామ్యంతో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పథకం అమలులో జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రి కీలక పాత్ర పోషిస్తారని ముఖ్యమంతి అన్నారు. దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రతి జిల్లాలో సెంటర్‌ ఫర్‌ దళిత్‌ ఎంటర్‌ ప్రైజ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దళితబంధు పథకం అమలుకు పటిష్టమైన యంత్రాంగం అవసరమని, వివిధ శాఖల్లో అదనంగా ఉన్న ఉద్యోగుల సమాచారం సమర్పించాలని ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావును మంత్రివర్గం ఆదేశించింది. లబ్ధిదారులకు అందజేసే ఒక ప్రత్యేక కార్డు నమూనాలను కేబినెట్‌ పరిశీలించింది. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, ఒంటరిగా మారి మానసిక వేదన, సామాజిక వివక్షను ఎదుర్కొంటూ సమాజ క్రూరత్వానికి బలయ్యే ప్రమాదముంది. గతంలో అనాథ పిల్లలకు బీసీ హోదా ఇవ్వడంతో పాటు వారి రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. ఇప్పుడు కూడా అనాథ పిల్లల సంక్షేమానికి సమగ్ర విధానాన్ని రూపొందించాలి. మానవీయ కోణంలో ప్రభుత్వ యంత్రాంగం స్పందించి అత్యధిక ప్రాధాన్యతనివ్వాలి' అని ముఖ్యమంత్రి ఆదేశించారు.


దీంతో పాటు ఖాళీగా వున్న అనువైన ప్రభుత్వ కార్యాలయాలను గుర్తించి అందులో అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించాలని మంత్రివర్గం అధికారులను ఆదేశించింది. ఇందుకు సంబంధించిన కార్యాచరణ కోసం మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అధ్యక్షతన మంత్రులు, హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్‌ రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, కేటీఆర్‌తో మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌ కుమార్‌ ఆహ్వానితులుగా కొనసాగనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అనాథల స్థితిగతుల మీద సమగ్ర నివేదికను సమర్పించాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు.


No comments

Powered by Blogger.