ఏపీ జనాలకు నిధులు: జగన్ 'వన్ టైం సెటిల్ మెంట్...!!'
అప్పుల్లో కురుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ను గాడినపెట్టే చర్యలను ఏపీ సర్కారు వేగవంతం చేస్తోంది. దీనిలో భాగంగా ఏపీ రావాల్సిన మొండి బకాయిలు, కేంద్రం నిధులు, ఇతరత్రా నిధులపై సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టిసారిస్తున్నారు.
ఇటీవల కేంద్రం నుంచి వరుసబెట్టి నిధులను తెప్పించుకోవడంలో జగన్ సర్కారు విజయవంతమైంది. ఇక తాజాగా ఏపీ కేబినెట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల లబ్ధిదారులకు మేలు చేకూర్చడంతోపాటు ఏపీకి 10వేల కోట్ల రూపాయాల ఆదాయం రాబట్టడమే లక్ష్యంగా ప్రణాళికలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈమేరకు ప్రభుత్వం ఆ దిశకు ముందడుగు వేస్తోంది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా గతంలో ఇంటి కోసం తీసుకున్న లబ్ధిదారుల రుణాలను మూడులక్షల వరకు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఏపీ క్యాబినెట్ దీనికి భిన్నంగా కొత్త ఆలోచనతో ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. చంద్రబాబు హయాంలోనే కాదు.. ఎన్టీఆర్ కాలం నుంచి ఇళ్ల బకాయిలను వన్ టైం సెటిల్మెంట్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. వన్ టైం సెటిల్మెంట్ ద్వారా లబ్ధిదారుల నుంచి నిర్ణీత మొత్తంలో డబ్బులు కట్టించుకొని వారి ఆస్తులను వారిపేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వనున్నారు. వీరినే ప్రభుత్వ హక్కుదారులుగా ప్రభుత్వం గుర్తించనున్నట్లు తెలుస్తోంది.
వన్ టైం సెటిల్మెంట్ కింద లబ్ధిదారులు గ్రామాల్లో ఐతే రూ.10వేలు, పట్టణాల్లో అయితే రూ.15వేలు, నగరాల్లో ఐతే 20వేలు చెల్లించాల్సి ఉంటుంది. అదే లబ్ధిదారుల ఇళ్లను మరొకరు కొనుగోలు చేసి ఉన్నట్లయితే ఈ డబ్బులకు రెట్టింపు చెల్లించాల్సి ఉంటుంది. అంటే గ్రామాల్లో 20వేలు, పట్టణాల్లో 30వేలు, నగరాల్లో 40వేలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఎన్టీఆర్ హయాం నుంచి లెక్కలు వేస్తుండటంతో అప్పటి నుంచి ఇళ్లు భారీగానే చేతులు మారే అవకాశం ఉంటుందని భావిస్తుంది. ఈ నేపథ్యంలో సగటున ఒక్కో ఇంటికి 20వేలు లబ్ధిదారులు డబ్బులు చెల్లించినా దాదాపుగా ప్రభుత్వానికి 10వేల కోట్ల రాబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మొత్తంగా 47లక్షల మంది పేదలు రుణాలు కట్టాల్సి ఉంది. వీరిలో 4.57లక్షల మంది పట్టణ ప్రాంతాల లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో కనీసం సగం మంది పథకంలో డబ్బులు కట్టినా రూ.5వేల కోట్లు మూడు నెలల్లోనే సర్కారు ఖజానాకు జమ కానున్నాయి. మరోవైపు ఈ నిర్ణయం అమల్లో వచ్చే సమస్యలపైన ప్రభుత్వం చర్చిస్తుంది. కాగా కొనుగోలు చేసిన వారికి ఈ ఇల్లు తప్ప మరేవీ ఉండకూడదంటూ ప్రభుత్వం షరతు విధించడం గమనార్హం. ఈ వన్ టైం సెటిల్మెంట్ ద్వారా లబ్ది కలుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు జగన్ సర్కారు నవరత్నాల్లో భాగంగా 30లక్షల పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ప్రభుత్వమే ఉచితంగా ఇళ్లు నిర్మిస్తోంది. తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ వన్ టైం సెటిల్మెంట్ ను లబ్దిదారులు ఏమేరకు సద్వినియోగం చేసుకుంటారో వేచిచూడాల్సిందే..!
No comments