CM jagan: చవితి ఉత్సవాలు ఇళ్లకే పరిమితం.... రాత్రి కర్ఫ్యూ కొనసాగింపు....!
కొవిడ్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్రంలో ప్రస్తుతం రాత్రి పూట అమలు చేస్తోన్న కర్ఫ్యూను మరి కొంత కాలం కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈమేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కొవిడ్ నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సీఎం సమీక్షించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షకు ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, డీజీపీ గౌతమ్ సవాంగ్, కొవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ టి.కృష్ణబాబు, వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. కొవిడ్ పరిస్థితులపై అధికారులతో సీఎం సమగ్రంగా చర్చించారు. కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా పండుగల సీజన్‌లో జాగ్రత్తలు పాటించాలని నిర్ణయం తీసుకున్నారు. వినాయకచవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేయాలని వైద్యుల సిఫార్సు మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇళ్లల్లో విగ్రహాలు పెట్టుకునేందుకు మాత్రమే అనుమతి ఇవ్వాలని, పబ్లిక్ స్థలాల్లో విగ్రహాలు వద్దని, నిమజ్జన ఊరేగింపులు చేయకూడదని నిర్ణయించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తప్పవని సీఎం పేర్కొన్నారు.
18 ఏళ్లు నిండిన వారందరికీ వచ్చే ఫిబ్రవరి నాటికి వ్యాక్సినేషన్ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వైరస్ సోకిన వారిలో ప్రభావాలను అధ్యయనం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 2.11 శాతానికి తగ్గిందని అధికారులు సీఎంకు నివేదించారు. 3 జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో 3శాతానికి లోపే పాజిటివిటీ రేటు ఉన్నట్టు తెలిపారు. గత మేలో గరిష్ఠ కేసుల సంఖ్య 2.11లక్షల నుంచి ప్రస్తుతం 14,473కి పాజిటివ్ కేసులు తగ్గాయన్నారు. దాదాపు పదివేల గ్రామ సచివాలయాల పరిధిలో కేసుల్లేవని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూ మరి కొంతకాలం పొడిగించాలని సమావేశంలో నిర్ణయించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ కొనసాగించనున్నారు.
No comments