Latest

Loading...

Health Benefits Of Walnuts: వాల్‌నట్స్‌ తింటే బాడీలో జరిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే.....

Health Benefits Of Walnuts


వయసు పైబడిన వారు ఎక్కువగా హృదయ (Heart) సంబంధిత వ్యాధుల బారిన పడుతుంటారు. పెద్దలు ఎక్కువగా వ్యాయామం చేయరు కాబట్టి వారి శరీరంలో ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ బాగా పేరుకుపోతుంది.


దీనినే లో-డెన్సిటీ-లిపోప్రొటీన్ లేదా చెడు కొలెస్ట్రాల్ (Bad Cholesterol) అని కూడా పిలుస్తారు. ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ కారణంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ. అయితే ఆరోగ్యవంతులైన వృద్ధులు వాల్‌నట్స్ (Walnuts) తినడం వల్ల ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గాయని తాజా అధ్యయనంలో తేలింది. రెండేళ్లపాటు ప్రతిరోజు సుమారు 1/2 కప్పు మోతాదులో వాల్‌నట్స్ తిన్న వారిలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు గణనీయంగా తగ్గినట్లు అధ్యయనం వెల్లడించింది.ఈ అధ్యయనాన్ని స్పెయిన్‌లో బార్సిలోనా హాస్పిటల్ క్లినిక్ & ఎండోక్రినాలజీ న్యూట్రిషన్ సర్వీస్‌ పరిశోధకులు చేపట్టారు. ఈ అధ్యయనం ఫలితాలు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కు చెందిన ప్రధాన పత్రిక 'సర్క్యులేషన్' లో ప్రచురించారు.


రోజూ వాల్‌నట్స్ తీసుకోవడం వల్ల ఎల్‌డీఎల్‌ కణాల సంఖ్య తగ్గుతుందని అధ్యయనం తెలిపింది. ఈ కణాలు గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని అంచనా వేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరిచే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు (ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్) వాల్‌నట్స్ లో పుష్కలంగా లభిస్తాయి.


మునుపటి అధ్యయనాలు ప్రకారం వాల్ నట్స్ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడంతో పాటు ఎల్‌డీఎల్‌ కణాల నాణ్యత పెరిగిందని అధ్యయన సహ రచయిత ఎమిలియో రోస్ తెలిపారు. ఆయన స్పెయిన్‌లోని బార్సిలోనా హాస్పిటల్ క్లినిక్ & ఎండోక్రినాలజీ న్యూట్రిషన్ సర్వీస్‌లోని లిపిడ్ క్లినిక్ కి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఎల్‌డీఎల్‌ కణాలు వివిధ సైజుల్లో ఉంటాయి కానీ చిన్న, దట్టమైన ఎల్‌డిఎల్ కణాలే అథెరోస్క్లెరోసిస్.. అంటే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తాయని రోస్ వివరించారు.


మే 2012 నుంచి మే 2016 వరకు కొనసాగిన ఈ అధ్యయనంలో బార్సిలోనా, స్పెయిన్, కాలిఫోర్నియాలోని లోమా లిండాలో నివసిస్తున్న ఆరోగ్యవంతులైన వృద్ధులు పాల్గొన్నారు. 63-79 వయసున్న (68 శాతం మహిళలు) 708 మంది వృద్ధులు పాల్గొన్నారు. వీరిని రెండు గ్రూపులుగా విభజించి.. ఒక గ్రూప్ కు ప్రతిరోజు వాల్‌నట్స్ అందించారు. మిగతా గ్రూప్ సభ్యులకు వాల్‌నట్స్ ఇవ్వలేదు. రెండేళ్ల తర్వాత పార్టిస్పెంట్స్ కొలెస్ట్రాల్ స్థాయిలు పరీక్షించారు.


లిపోప్రొటీన్‌ల డెన్సిటీ, సైజును న్యూక్లియర్ మాగ్నెటిక్ రెసొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ ద్వారా విశ్లేషించారు. అయితే రెండేళ్ల పాటు వాల్‌నట్స్ తిన్న పార్టిసిపెంట్లలో ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉన్నట్లు విశ్లేషణలో తేలింది. సగటున 4.3 mg/dL కొలెస్ట్రాల్ తగ్గినట్లు.. మొత్తం మీద కొలెస్ట్రాల్ సగటున 8.5 mg/dL తగ్గినట్లు అధ్యయనంలో వెల్లడైంది.


వాల్‌నట్స్ ప్రతిరోజూ తినడంతో మొత్తం ఎల్‌డీఎల్‌ కణాల సంఖ్య 4.3 శాతం తగ్గిందని.. చిన్న ఎల్‌డీఎల్‌ కణాల సంఖ్య 6.1 శాతం తగ్గించిందని పరిశోధనలో తేలింది. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని పరిశోధకులు పేర్కొన్నారు.


ఇక గుండెజబ్బుకు కారకాలైన ఇంటర్మీడియట్ డెన్సిటీ లిపోప్రొటీన్ (IDL) కొలెస్ట్రాల్ కూడా తగ్గింది. అయితే వాల్‌నట్స్ తీసుకున్న పార్టిసిపెంట్లలో ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్ మార్పులు పురుషులలో ఒకలా ఉంటే మహిళల్లో మరోలా ఉన్నాయి. మగవారిలో కొలెస్ట్రాల్ 7.9 శాతం తగ్గితే.. మహిళల్లో 2.6 శాతం తగ్గింది.

No comments

Powered by Blogger.