Jagananna Vidya Deevena : హైకోర్టు కీలక తీర్పు, ఇకపై డబ్బు నేరుగా వారి ఖాతాల్లోకే.....?
Jagananna Vidya Deevena : జగనన్న విద్యాదీవెన పథకంపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
విద్యాదీవెన నగదు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వేయాలనే జీవోను కొట్టివేసింది. ఇక నుంచి నగదును కాలేజీల ప్రిన్సిపల్ అకౌంట్ లోనే వేయాలని సర్కార్ ను ఆదేశించింది.
విద్యాదీవెన కింద తల్లుల ఖాతాలో డబ్బు జమ చేయడంపై దాఖలైన పిటిషన్ ను హైకోర్టు విచారించింది. తల్లులు తమ ఖాతాలో పడిన నగదును కాలేజీలకు చెల్లించకపోతే తాము ఏమీ చేయలేమని ప్రభుత్వం చెప్పడాన్ని కృష్ణదేవరాయ విద్యాసంస్థలు హైకోర్టులో సవాల్ చేశాయి. ఫీజులను నేరుగా కాలేజీల ఖాతాల్లోకి జమ చేయాలని పిటిషనర్ కోరారు. తల్లిదండ్రులు ఆ నగదును కాలేజీల్లో చెల్లించకపోతే యాజమాన్యాలే నష్టపోతాయని తమ పిటిషన్ లో వివరించారు.
ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం… వాదనలు విన్న తర్వాత కీలక ఆదేశాలు జారీ చేసింది. జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా అందించే నగదును విద్యాసంస్థ ప్రిన్సిపల్ ఖాతాలో జమ చేయాలని స్పష్టం చేసింది.
కోర్టు తీర్పుతో ఇకపై, జగనన్న విద్యా దీవెన డబ్బు.. విద్యార్థులు తల్లుల అకౌంట్లలో కాకుండా నేరుగా కాలేజీలకే చెల్లించాల్సి ఉంటుంది. అయితే హైకోర్టు తీర్పుపై జగన్ సర్కార్ అప్పీల్‌కు వెళ్తుందా? లేక అమలు చేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని తల్లుల ఖాతాల్లో జమ చేసేలా ప్రభుత్వం.. జగనన్న విద్యా దీవెన పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో రూపకల్పన చేసిన జగనన్న విద్యా దీవెన రెండో విడత నిధులను ఈ ఏడాది జూలై 29 సీఎం జగన్ విడుదల చేశారు. జగనన్న విద్యా దీవెన పథకం రెండో విడతలో సుమారు 11 లక్షల మంది విద్యార్థులకు రూ.693 కోట్లు విడుదల అయ్యాయి. ఇక.. జగనన్న వసతి దీవెన పథకం ద్వారా ఐటీఐ స్టూడెంట్స్‌కు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ ఆపై కోర్సులు అభ్యసించే వారికి రూ. 20 వేల చొప్పున వసతి, భోజన ఖర్చుల కోసం అందిస్తున్న విషయం తెలిసిందే.
No comments