Nuts Health Benefits: నానబెట్టిన గింజలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే మీరూ రోజూ ఉదయాన్నే తింటారు
కరోనా మహమ్మారితో అందరిలోనూ ఆరోగ్య స్పృహ పెరిగింది. ఇమ్యూనిటీ పెంచే ఆహార పదార్థాలు తీసుకునేందుకు ప్రజలు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే రోగనిరోధక శక్తిని పెంచే వాటిలో గింజలు లేదా నట్స్ ముందు వరుసలో ఉంటాయి.
అందుకే ఉదయం లేవగానే వీటిని తినడం ద్వారా రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సహజంగా రాత్రి పూట ఆహారం తీసుకున్న తర్వాత మళ్లీ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసే వరకు సుమారుగా 12 నుంచి 14 గంటల విరామం ఉంటుంది. దీంతో శరీరంలో శక్తి స్థాయిలు తగ్గిపోతాయి. తద్వారా ఉదయం నిద్ర లేస్తూనే మనకు శక్తి అవసరం అవుతుంది. అందుకే మనం ఉదయం తీసుకునే ఆహారంలో ఎక్కువ పోషకాలు ఉండేలా చూసుకోవాలి. వాల్‌నట్స్ మీ శక్తి పెంచడంలో సరిగ్గా సహాయపడతాయి.
వాల్‌నట్స్‌లో ఉండే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు మిమ్మల్ని రోజంతా యాక్టివ్‌గా ఉంచేందుకు సహకరిస్తాయి. దీని వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండటమే కాదు, మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఎంత ఎక్కువ సేపు పనిచేసినా అలసిపోరు. అయితే వాల్‌నట్స్‌ను నేరుగా తినడం కంటే రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తినడం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా పిస్తా, బాదం పప్పు, వాల్‌నట్స్ వంటి గింజలను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో తినాలి. వీటన్నింటినీ కలిపి ఉదయం ఒక కప్పు మోతాదులో తింటే సరిపోతుంది.
నానబెట్టిన బాదం
ఉదయం లేవగానే నానబెట్టిన బాదం తీసుకుంటే, మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అంతేకాదు, మీ జీర్ణక్రియ మెరుగవుతుంది. బాదంలో ప్రోటీన్, విటమిన్-ఈ, మెగ్నీషియం అధికంగా లభిస్తుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. బాదంను కూడా నేరుగా తినడం కంటే నానబెట్టి తింటే చాలా మంచింది. ఎందుకంటే బాదం పై తొక్కలో టానిన్లు ఉంటాయి. ఇది పోషకాలను నిరోధిస్తుంది. అందుకే, పై పొట్టు తీసి నానబెట్టిన బాదంను తినాలని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.
నానబెట్టిన వాల్‌నట్స్
వాల్‌నట్స్‌లో యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా లభిస్తాయి. ఇది మీ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అందుకే వాల్‌నట్స్‌ను "బ్రెయిన్ ఫుడ్" గా పేర్కొంటారు. వాల్‌నట్స్‌లో కాల్షియం, పొటాషియం, ఐరన్, రాగి, జింక్ వంటి పోషకాలు నిండి ఉంటాయి. నానబెట్టిన వాల్‌నట్స్ మీ జీవక్రియను పెంచుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. మీ బరువు తగ్గించడంలో ఇవి మరింత సహాయపడతాయి.
No comments