Prevent Covid Death: ఒక్క డోసుతో.. మరణం నుంచి 96శాతం రక్షణ...!!
డెంగీ జ్వరాలపై హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం
వైరస్‌ను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.
ఒక్క డోసు తీసుకోవడం ద్వారా కొవిడ్ మరణాన్ని 96.6శాతం నివారించవచ్చని ఉద్ఘాటించింది. అంతేకాకుండా రెండు డోసుల అనంతరం కొవిడ్ మరణాలను నివారించడంలో 97.5శాతం సమర్థత కలిగివున్నట్లు పేర్కొంది. ఇక వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వైరస్ బారినపడినా ప్రమాదం తక్కువేనని వెల్లడించింది.
దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఏప్రిల్ 18 నుంచి ఆగస్టు 15 వరకు సేకరించిన సమాచారం ప్రకారం, కరోనా వల్ల కలిగే మరణాలను వ్యాక్సిన్‌లు నివారిస్తున్నట్లు తేలిందని భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) చీఫ్ బలరాం భార్గవ వెల్లడించారు. అన్ని వయసుల వారికి వ్యాక్సిన్‌లు రక్షణ కల్పిస్తున్నాయని తెలిపారు. సెకండ్ వేవ్‌లో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకోని వారేనని పేర్కొన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.
100శాతం మందికి ఇవ్వాల్సిందే..!
దేశంలో ఇప్పటివరకు 18ఏళ్లు పైబడిన వారిలో 58శాతం మందికి కనీసం ఒక డోసు అందించినట్లు కొవిడ్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ డాక్టర్ వీకే పాల్ పేర్కొన్నారు. హెర్డ్ ఇమ్యూనిటీ సాధించాలంటే మిగతా వాళ్లందరికీ వ్యాక్సిన్ అందించాల్సి ఉందన్నారు. కరోనా వైరస్ నుంచి రక్షణ పొందడంలో వ్యాక్సినేషన్ అత్యంత కీలకమని.. తద్వారా కొవిడ్ వల్ల ఉన్న మరణం ముప్పు నుంచి బయటపడవచ్చని వివరించారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వైరస్ బారినపడే (బ్రేక్‌త్రూ) అవకాశాలు ఉంటాయని వీకే పాల్ తెలిపారు. అయితే, అలాంటి వాటి వల్ల మరణం సంభవించే ప్రమాదం ఉండదని.. ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం కూడా తక్కువేనని వెల్లడించారు.
డెంగీ జ్వరాలపై హెచ్చరిక..
ఇక కొవిడ్ విజృంభిస్తోన్న వేళ డెంగీ కేసులు పెరుగుతుండడం పట్ల వీకే పాల్ హెచ్చరించారు. ఉత్తర్ ప్రదేశ్‌లో చిన్నారుల మరణాలకు కారణమవుతున్న జ్వరాలకు డెంగీనే కారణమని స్పష్టం చేశారు. డెంగీ నివారణకు వ్యాక్సిన్ లేనందున అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కొవిడ్‌తో పాటే ఇలాంటి అంటువ్యాధులపైనా పోరును కొనసాగించాలని కొవిడ్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ వీకే పాల్ పేర్కొన్నారు.
కేరళలోనే 68శాతం కేసులు..
దేశంలో పలు చోట్ల కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా కేరళలో వైరస్ తీవ్రత నియంత్రణలోకి రావడం లేదు. గత వారంలో దేశవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కేసుల్లో 68శాతం ఒక్క కేరళలోనే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా 43వేల కేసులు వెలుగు చూడగా.. 338 మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటివరకు కరోనా మహమ్మారికి బలైన వారి సంఖ్య 4లక్షల 41వేలు దాటింది. ఇక ఇప్పటివరకు దేశంలో 71కోట్ల కొవిడ్ డోసులను అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
No comments