Telangana: గుడ్‌న్యూస్.. ప్రతి జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం...!!
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది.
కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా సర్కారు దవాఖానాలను ఆధునీకరిస్తోంది. టెస్ట్‌ల కోసం డయాగ్నస్టిక్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసింది. ఐతే ఇప్పటికీ చాలా ఆస్పత్రుల్లో నర్సుల కొరత వేధిస్తోంది.ఒక వార్డు ఒకే నర్సు ఉన్న ఆస్పత్రులు చాలానే ఉన్నాయి. ఆ ఒక్క నర్సే వార్డులో ఉన్న పేషెంట్లందరినీ చూసుకోవాల్సి ఉంటుంది. ఐతే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఇప్పటికే జిల్లాకో మెడికల్ కాలేజిని ఏర్పాటు చేయాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా వీటికి అనుబంధంగా నర్సింగ్ కాలేజిని కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించింది.
ప్రతి జిల్లాలోనూ మెడికల్ కాలేజికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ కూడా ఏర్పాటు చేయాలని ఇటీవలే సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. అందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నిర్వహించిన వైద్య ఆరోగ్యశాఖ సమీక్షలోనూ ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు.
తెలంగాణలో ఉస్మానియా, గాంధీ, నిమ్స్, వరంగల్ ఎంజిఎం, జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రి, సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రి, ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి. ఈ ఏడు కాలేజీల్లో కలిపి మొత్తం 480 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక రాష్ట్రంలో మరో 78 ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలు ఉండగా.. వీటిలో 3,120 బీఎస్సీ నర్సింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు రాష్ట్రంలో కొత్త నర్సింగ్ కాలేజీలు కూడా ఏర్పాటవుతున్నాయి. వచ్చే ఏడాది నాటికి ఇవి సిద్ధమవుతాయి. అంతేకాదు 2022లో 14 కొత్త నర్సింగ్ కాలేజీలకు దరఖాస్తు చేయడానికి ప్రభుత్వం నుంచి ఇప్పటికే అనుమతులు మంజూరయ్యాయి. ఈ 14 కాలేజీల రూపంలో మరో 1,400 నర్సింగ్ సీట్లు కొత్తగా అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో 2022-23 సంవత్సరానికి ప్రభుత్వ కాలేజీల్లోనే 1,880 నర్సింగ్ సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి.
2023-24 సంవత్సరానికి మరో 15 నర్సింగ్ కాలేజీల వరకు నెలకొల్పనున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. కనీసం వంద పడకలున్న ప్రతి ప్రభుత్వ ఆసుపత్రికి అనుబంధంగా 60 సీట్లతో నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేయనున్నారు. ఇక 250-300 పడకలున్న చోట 100 సీట్లతో నర్సింగ్ కాలేజిని ఏర్పాటు చేయబోతున్నారు. కొన్ని జిల్లాల్లో రెండు నర్సింగ్ కాలేజీలు కూడ అందుబాటులోకి వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. వీటి ద్వారా మరో 1,500 నర్సింగ్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. కొత్త నర్సింగ్ కాలేజీలతో వైద్య విద్యతో పాటు నర్సింగ్ విద్యకూ మహర్దశ పట్టనుంది. ప్రతి జిల్లా కేంద్రంలోనూ నర్సింగ్ కాలేజీ ఉండడం వల్ల గ్రామీణ విద్యార్థులకు మరిన్ని అవకాశాలు వస్తాయి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందడంతో పాటు నర్సింగ్ విద్యార్థులకు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు లభించనున్నాయి.
No comments