Latest

Loading...

జగన్ సర్కార్ కు కేంద్రం భారీ షాక్.... వాటిని కెలికితే మంటలే-వేల కోట్లు భరించాల్సిందే....!!


 కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ తో ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఎంత సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నా అంతిమంగా కీలక అంశాల వద్దకు వచ్చే సరికి ఎదురుదెబ్బలు మాత్రం తప్పడం లేదు.

ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి గతంలో ఇచ్చిన హామీల్ని ఇప్పటివరకూ పూర్తిగా అమలు చేయని కేంద్రం.. ఇప్పుడు రాష్ట్రానికి గుదిబండలుగా మారుతున్న ఒప్పందాల విషయంలోనూ కనికరించడం లేదు. కేంద్రంతో సీఎం జగన్ ఎంత లాబియింగ్ చేస్తున్నా తమ ప్రయోజనాల్ని కాదని కేంద్రం రాష్ట్రానికి సహకరించే అవకాశాలు కనిపించడం లేదు. తాజాగా పీపీఏలపై కేంద్రం తీసుకున్న నిర్ణయమే దీనికి ఉదాహరణ.


ఏపీలో 2019లో అధికారంలోకి రాకముందు కేంద్రంతో అంత సన్నిహిత సంబంధాలు లేని వైఎస్ జగన్.. ఓసారి అధికారంలోకి వచ్చాక మాత్రం కేంద్రంతో అన్ని విషయాల్లోనూ సహకరిస్తూ ముందుకు పోతున్నారు. అడిగినా, అడగకపోయినా కీలక అంశాల్లో వైసీపీ ఎన్డీయే సర్కార్ కు మద్దతిచ్చిన తీరు చూసి దేశంలో మిగతా ప్రాంతీయ పార్టీలు అవాక్కవుతున్న పరిస్ధితి.


మరి ఇంత గొప్పగా సాయం చేస్తున్న జగన్ సర్కార్, వైసీపీతో కేంద్రం ఎలా వ్యవహరించాలి ?, జగన్ అడిగిందల్లా కాదనకుండా ఇచ్చి తీరాల్సిందే. కానీ అలా జరుగుతుందా అంటే మాత్రం ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. తాజాగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన మరో కీలక అంశంలో కేంద్రం వ్యవహరించిన తీరు జగన్ సర్కార్ కు మంటపుట్టిస్తోంది.

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి నిరంతరాయంగా విద్యుత్ అందించే పేరుతో భారీ ఎత్తున ప్రైవేటు విద్యుత్ సంస్ధల నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరిగాయి. వేల కోట్ల రూపాయలతో జరిగిన ఈ ఒప్పందాలు వచ్చే పాతికేళ్ల కాలానికి వర్తించబోతున్నాయి. అంటే రాష్ట్రంలో అధికారంలో ఎవరున్నారనే దానితో సంబంధం లేకుండా వచ్చే పాతికేళ్ల పాటు ఈ ఒప్పందాల్ని అమలు చేసి తీరాల్సిందే. అలా చేయడంలో విఫలమైతే మాత్రం న్యాయవివాదాలు తప్పవు. దీంతో అప్పటి టీడీపీ సర్కార్ చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. అయినా చంద్రబాబు లెక్క చేయలేదు.


వైసీపీ అధికారంలోకి రాగానే చంద్రబాబు సర్కార్ చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)పై సమీక్షలు నిర్వహిస్తామని ఎప్పటినుంచో చెప్తూ వచ్చిన వైఎస్ జగన్.. సీఎం కాగానే దీనికి తెరతీశారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై సమీక్షలకు దిగారు. అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రం వచ్చే పాతికేళ్లలో దాదాపు 20 వేల కోట్లను భరించే పరిస్ధితుల్లో లేదు కాబట్టి విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్ని సవరించాలని ఉత్పత్తి సంస్ధలకు సూచించారు. దీంతో చంద్రబాబు సర్కార్ తో ఒప్పందాలు చేసుకున్న విద్యుత్ ఉత్పత్తిదారులు బెంబేలెత్తారు. కోర్టుల్ని ఆశ్రయించారు. పీపీఏల సమీక్ష వద్దంటే వద్దంటూ కేంద్రానికి మొరపెట్టుకున్నారు.

గతంలో ముందున్న ప్రభుత్వాలు చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను యథాతథంగా అమలు చేయాల్సిందేనంటూ కేంద్రం తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలు జగన్ సర్కార్ కు భారీ షాకిచ్చాయి. విద్యుత్ చట్టంలోని నిబంధనల ప్రకారం కుదుర్చుకున్న ఒప్పందాలను మధ్యలో సమీక్షించడం కానీ, మార్పులు చేర్పులు కానీ చేస్తే వాటి వల్ల విద్యుత్ ఉత్పత్తి సంస్ధలకు తలెత్తే నష్టాల్ని, పడే ప్రభావానికి రాష్ట్ర ప్రభుత్వాలు తగిన మూల్యం చెల్లించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది.


అలాగే రాష్టప్రభుత్వ చర్యల వల్ల విద్యుత్ సంస్ధలకు కలిగే నష్టాల్ని లెక్కించడానికి కూడా ఓ విధానాన్ని సైతం ప్రకటించింది. ఈ విధానం వల్ల భారీ పెట్టుబడులు పెట్టి విద్యుత్ సంస్ధలు ఏర్పాటు చేసే పెట్టుబడిదారులకు భద్రత ఉంటుందని కేంద్రం చెబుతోంది. దేశంలో పెట్టుబడుల అనుకూల వాతావరణం కూడా ఏర్పడుతుందని కేంద్రం స్పష్టం చేస్తోంది. దీంతో తమకు ఇష్టమున్నా, లేకున్నా, భారమైనా, కాకున్నా జగన్ సర్కార్ కచ్చితంగా చంద్రబాబు సర్కార్ లో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాల్ని అమలు చేయాల్సిన పరిస్ధితులు నెలకొన్నాయి.


No comments

Powered by Blogger.