Latest

Loading...

Explained: మీ ఇంట్లో పిల్లలు తినేటప్పుడు టీవీ లేదా మొబైల్‌ గానీ చూస్తున్నారా.. ఇది తెలిస్తే వెంటనే మాన్పించేస్తారు.....!

Explained

 మన ఆహారపు అలవాట్లకు, ఆరోగ్యానికి ప్రత్యక్ష సంబంధం ఉంటుందని ఎన్నో పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా పిల్లలు సరైన ఆహారపు అలవాట్లు పాటించకపోతే భవిష్యత్తులో అనర్థాలు ఎదురవుతాయి.ప్రపంచంలోని అనేక పెద్ద యూనివర్సిటీలు ఈ పరిశోధనలో పాలుపంచుకున్నాయి. టీవీ, ల్యాప్‌టాప్ లేదా మొబైల్ చూస్తూ ఆహారం తినే పిల్లలు అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని పరిశోధన తేల్చింది. ఇలాంటివారు పెద్దయ్యాక చిన్న విషయాలకే ఎక్కువగా రియాక్ట్ అవుతూ అసంతృప్తికి లోనవుతారని గుర్తించింది. ఆ అధ్యయనం ఫలితాలను బయోమెడ్ సెంట్రల్ జర్నల్‌లో ప్రచురించారు.


ముఖ్యంగా టీవీ చూస్తూ తినే అలవాటు ఉన్న.. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు స్థూలకాయం బారిన పడే ప్రమాదం ఉందని పరిశోధకులు తేల్చారు. అలాగే కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ తినేవారు, వారితో కలిసి రాత్రి భోజనం చేసే పిల్లలు స్థూలకాయానికి గురయ్యే ప్రమాదం తక్కువగా ఉందని అధ్యయనం గుర్తించింది.


* దేశంలో 10-12% మంది పిల్లలు ఊబకాయులే

గత కొన్ని సంవత్సరాలుగా పిల్లల్లో ఊబకాయం సమస్య పెరుగుతున్నట్లు సర్వేలో తేలింది. ఇది తీవ్రమైన సమస్యగా పరిణమిస్తోంది. భారతదేశంలో 10 నుంచి 12 శాతం మంది పిల్లలు ఊబకాయంతో బాధపడుతున్నట్లు పరిశోధన గుర్తించింది. ఈ లెక్కన చూస్తే.. 2030 నాటికి దేశంలోని దాదాపు సగం మంది పిల్లలు ఈ వ్యాధి బారిన పడవచ్చు. గత 50 ఏళ్లలో.. భారత్‌లో పిల్లలకు అందించే నూనె ఉత్పత్తుల వినియోగం 20 శాతం పెరిగిందని కొన్ని సర్వేలు తేల్చాయి. మిఠాయి, చాక్లెట్, పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్, స్వీట్లు తినేవారిలో దాదాపు 80 శాతం మంది 11- 20 సంవత్సరాల మధ్య వయసు పిల్లలు ఉన్నట్లు ఆ సర్వే నివేదించింది.


* WHO హెచ్చరిక

పిల్లల ఆరోగ్యానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఇటీవల ఒక నివేదిక విడుదల చేసింది. 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల స్క్రీన్ టైమ్‌ను (టీవీ, స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్, ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్‌ల వీక్షణ సమయం) నిర్ణయించింది. నిర్దేశించిన టైమ్ కంటే ఎక్కువ సమయం స్క్రీన్ టైమ్ ఉండే పిల్లలు శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. మొబైల్ ఫోన్‌లు, టీవీ స్క్రీన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్‌లను పిల్లలను దూరంగా ఉంచాలని WHO సూచించింది.


ఒక సంవత్సరం కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలుకు 'జీరో స్క్రీన్ టైమ్‌'ను సంస్థ నిర్దేశించింది. అంటే వారిని పూర్తిగా గాడ్జెట్లకు దూరంగా ఉంచాలని అర్థం. 1 నుంచి 2 సంవత్సరాల పిల్లలకు స్క్రీన్ టైమ్ రోజుకు ఒక గంట మించకూడదు. 3 నుంచి 4 సంవత్సరాల పిల్లలకు ఒక రోజులో గరిష్టంగా ఒక గంట స్క్రీన్ టైమ్‌ను WHO నిర్దేశించింది.


* తినేటప్పుడు టీవీ చూడటం వల్ల కలిగే నష్టాలు

తినేటప్పుడు టీవీ చూడటం వల్ల జీవక్రియ మందగిస్తుంది. ఫలితంగా శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. ఆహారం తింటున్నప్పుడు వారి దృష్టి మొత్తం టీవీలో నడుస్తున్న ప్రోగ్రామ్‌పై కేంద్రీకృతమై ఉంది. దానివల్ల అది ఎంత తింటున్నారు అనేది పట్టించుకోరు. దీనికి తోడు చాలామంది పిల్లలు టీవీ చూసేటప్పుడు జంక్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. వీటిని భోజనంలో అధికంగా చేర్చడం వల్ల పిల్లలు చాలా త్వరగా ఊబకాయం బారిన పడతారు. కాబట్టి పిల్లల్లో ఈ అలవాటును మాన్పించండి. అందరూ కలిసి భోజనం చేసిన తరువాత హాయిగా టీవీ చూడవచ్చు.


* వైద్యులు ఏమంటున్నారు?

ఐదేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు ఏది మంచిది, ఏది చెడు అనే తేడాలు తెలియవు. ఆ వయసులో వారు ప్రత్యక్షంగా చూసిన వాటి నుంచే ఎక్కువగా నేర్చుకుంటారు. పిల్లలు కార్టూన్‌లలో లాగా మాట్లాడటానికి ప్రయత్నించడం మనం చూస్తుంటాం. టీవీల ప్రభావం వారిపై ఎక్కువగా ఉంటుందని ఈ ఉదాహరణ ద్వారా చెప్పవచ్చు. దీని కారణంగా వారికి మాటలు కూడా ఆలస్యంగా వస్తాయంటున్నారు పిల్లల వైద్య నిపుణులు. ఈ పిల్లలు ఎదిగే కొద్దీ కమ్యూనికేషన్ స్కిల్స్‌కు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.


* సైకియాట్రిస్ట్‌లు ఏం చెబుతున్నారు?

ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు తమపై చిన్న చిన్న విషయాలకే కోప్పడుతున్నట్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నారు. చాలామంది సైకియాట్రిస్ట్‌లు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఆ వయసులో పిల్లల ఊహాశక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే పూర్వం పిల్లలకు కథలు చెప్పేవారు. కానీ ఇప్పుడు కథలు చెప్పేవారు కరువయ్యారు. ఈ తరం తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్ ఇచ్చి వదిలేస్తున్నారు. దీంతో ఈ చెడు అలవాటునే వారు మంచిదిగా భావిస్తున్నారు. ఇదే సమయంలో వారి నుంచి గాడ్జెట్లను దూరం చేస్తే కోప్పడటంతో పాటు ఏడుస్తుంటారు.


* పిల్లలకు ఎలాంటి ఆహారం అందించాలి?

పిల్లల ఆహారంలో రంగురంగుల పండ్లు, కూరగాయలను చేర్చాలని డైటీషియన్లు సలహా ఇస్తుంటారు. ఎందుకంటే చిన్న పిల్లలు వివిధ రకాల రంగులను ఇష్టపడతారు. వారి భోజనంలో అన్ని రకాల కూరగాయలు ఉండటం ద్వారా పోషకాలు అందటంతో పాటు ఆరోగ్యమూ సొంతమవుతుంది. చిప్స్, కరకరలాడే ఫ్రై ఫుడ్స్, జంక్ ఫుడ్, చాక్లెట్లను పిల్లలకు ఇవ్వకూడదు. ఇవి పిల్లలకు ప్రమాదకరంగా మారతాయి.


* ఊబకాయానికి ఇలా చెక్ పెట్టండి

సాధారణంగా ఊబకాయానికి జన్యుపరమైన కారణాలతో పాటు జీవనశైలి కూడా కారణం కావచ్చు. శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ క్యాలరీలు తినే పిల్లల్లో ఊబకాయం వస్తుంది. ఆ వయసులో వారు ఎలాంటి వ్యాయామం చేయరు. అందుకే పిల్లలు టీవీలకు అతుక్కుపోకుండా జాగ్రత్తపడాలి. తరచుగా బయటకు తీసుకెళ్లాలి. ఎంతోకొంత శారీరక శ్రమ అందేలా చూడాలి. తోటి పిల్లలతో కలిసి ఆడుకునేలా ప్రోత్సహించాలి.

No comments

Powered by Blogger.