Andhra's Three-Capital Bill: మూడు రాజధానుల చట్టం రద్దు.. ఎందుకు చేశారు.. తరువాత ఏం జరుగుతుంది...!!
రాష్ట్రంలో ఎంతో వివాదాస్పదమైన AP రాజధాని వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధి చట్టం- 2020ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం (Andhra pradesh govt) నవంబర్ 22, 2021న రద్దు చేసింది.
అయితే ఈ చట్టం రద్దు ను శాసన సభ ఆమోదించినప్పటికీ మూడు రాజధానుల అంశం.. అమరావతి (Amaravati) ప్రజల వ్యతిరేకత వంటి అంశాలపై ప్రజల్లో చర్చ మొదలైంది. అసెంబ్లీ (Assembly)లో ఈ అంశంపై మాట్లాడిన సీఎం జగన్ (CM Jagan).. తాము రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఈ బిల్లు (Bill) తీసుకొస్తే.. కొందరిని దీనిపై అపోహలు, అనుమానాలు సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అందుకే మూడు రాజధానులకు సంబంధించిన బిల్లులోని ప్రభుత్వ సదుద్దేశాన్ని వివరించేందుకు.. చట్టపరంగా, న్యాయపరంగా అన్ని సమాధానాలు ఇస్తూ బిల్లును మరింత మెరుగుపచేందుకు, ఇంకా ఏమైనా మార్పులు అవసరమైతే వాటిని కూడా పొందుపరిచేందుకు గతంలో ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కు తీసుకుంటున్నట్లు సీఎం జగన్ తెలిపారు.
ఏమిటీ చట్టం.. ఏముంది ఇందులో..
AP రాజధాని వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి చట్టం- 2020, రాష్ట్రానికి అమరావతి, విశాఖపట్నం, కర్నూలు అనే మూడు రాజధానుల ఏర్పాటుకు అనుమతించింది. గతేడాది ఆమోదించిన ఈ చట్టం రాష్ట్ర వికేంద్రీకరణపై దృష్టి సారించింది.
అమరావతిలో గొప్ప రాజధానిని నిర్మించాలని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన చట్టాన్ని రద్దు చేయడంతో పాటు ఈ చట్టం ఆమోదించబడింది. ఇతర ప్రాంతాలను అభివృద్ది చేయకుండా ఒకే రాజధాని అభివృద్ధిపై దృష్టి పెట్టడం సరికాదని చట్టం వాదన. రాజధానులను వికేంద్రీకరణ చేయడం సమంజసమని జగన్మోహన్‌రెడ్డి గతంలో వాదించారు.
చట్టం ఎందుకు వివాదాస్పదమైంది?
2019లో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చారు. అంతకు ముందు ప్రభుత్వం అమరావతిలో రాష్ట్ర రాజధాని ఏర్పాటు కోసం 34,000 ఎకరాలకు పైగా సారవంతమైన భూమిని రైతుల వద్ద సేకరించింది. కొత్త ప్రభుత్వం రాజధాని వికేద్రికరణకు మొగ్గు చూపడంతో భూమి ఇచ్చిన రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వారంతా కోర్టును ఆశ్రయించారు. అక్కడ భవనాలకు ప్రభుత్వం అప్పటికే గణనీయంగా నిధులు వెచ్చించింది.
ఇదంతా ఖజానకు భారం అవుతుందనే వాదన తెచ్చారు. అంతే కాకుండా భూమి ఇచ్చిన వారు తాము నష్టపోయామని ఆవేదనను కోర్టుకు తెలియజేశారు.
చట్టం ఎందుకు రద్దు చేశారు.
అసెంబ్లీలో ఈ విషయంపై జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ, అందరితో మరింత చర్చించి, ఆపై ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణపై నిర్ణయం తీసుకోవాలని అన్నారు. త్వరలో కొత్త బిల్లు రూపొందించి ప్రవేశపెడతామని తెలిపారు. అందువల్ల, ప్రస్తుతానికి ఈ ఆలోచన పూర్తిగా నిలిపి వేయలేదని అన్నారు.
ఇప్పుడు ఏం జరుగుతుంది?
ఈ చట్టం రద్దయితే.. పాత రాజధాని ప్రాంత అభివృద్ధి చట్టం-2014 అమల్లోకి వస్తుంది. అంటే ఈ నిర్ణయంతో అమరావతి రాజధానిగా ఉంటుంది. గత సంవత్సరం, అప్పటి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రెండు బిల్లులపై సంతకం చేశారు - ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ మరియు అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధి బిల్లు, 2020 మరియు AP రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (రద్దు) బిల్లు, 2020, కార్యనిర్వాహక వ్యవస్థను ఏర్పాటు చేయడం, విశాఖపట్నం, అమరావతి మరియు కర్నూలులో శాసన మరియు న్యాయ రాజధానులు. ఇప్పుడు ఆ చట్టం రద్దయింది.
No comments