AP News మృతుల కుటుంబాలకు 5లక్షలు...!!
భారీ వర్షాల కారణంగా నష్టపోయిన బాధితులకు వీలైనంత త్వరగా పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందించాలన్నారు. బాధితులకు ఎలాంటి సాయం కావాలన్నా యుద్ధప్రాతిపదికన సమకూరుస్తామని హామీ ఇచ్చారు. వర్షాల వల్ల కలిగిన నష్టాలపై వచ్చే వినతులపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం సచివాలయం నుంచి సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాలపై పర్యవేక్షణకు జిల్లాల్లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి ఇళ్లు శుభ్రం చేసుకోవడానికి రూ.2వేలు ఇవ్వాలన్నారు. బాధితులకు మంచి భోజనం, తాగునీరు అందించాలన్నారు. రైతులు మళ్లీ పంట వేసుకునేందుకు విత్తనాలు సరఫరా చేయాలన్నారు. తిరుమల దర్శనానికి వచ్చిన భక్తులకు సహాయంగా నిలవాలని చిత్తూరు కలెక్టర్ హరినారాయణ్‌ను సీఎం ఆదేశించారు. రైళ్లు, విమానాలు రద్దయిన నేపథ్యంలో కనీసం ఒకటి, రెండు రోజులు వారికి తగిన వసతులు సమకూర్చాలని సీఎం ఆదేశించారు.
నేడు సీఎం జగన్ ఏరియల్ సర్వే
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ శనివారం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు సహా భారీవర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు. గన్నవరం విమానాశ్రయం నుంచి కడప చేరుకుని అక్కడ నుంచి హెలికాష్టర్ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు.
జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరద పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. సీఎం జగన్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. వర్షాల కారణంగా సంభవించిన పంట, ఆస్తి నష్టం తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రం అన్ని విధాలా సాయం అందించి ఆదుకుంటుందని మోదీ హామీ ఇచ్చారు.
లక్షల ఎకరాల్లో పంట నష్టం
అనంతపురం జిల్లాలో 74,871 ఎకరాల్లో రూ.110.53 కోట్ల విలువైన పప్పుశనగ, వరి, వేరుశనగ, మొక్కజొన్న, పత్తి, కంది, పొద్దుతిరుగుడు పంటలు దెబ్బతిన్నాయి. నెల్లూరు జిల్లాలో మిరప, మినుము, వరి, పొగాకు పంటలు దెబ్బతిన్నాయి. ఇందుకూరుపేట, అనంతసాగరం, సంగం, చేజర్ల తదితర ప్రాంతాల్లోని చేపలు, రొయ్యల గుంటలు నీట మునిగిపోయాయి. కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదికి వరద పోటెత్తింది. 42వేల క్యూసెక్కుల నీటిని జలాశయం నుంచి 16గేట్లు ఎత్తి నదిలోకి వదిలారు. పశ్చిమగోదావరి జిల్లాలో 5.58 లక్షల ఎకరాల్లో సార్వా వరి సాగు చేయగా ఇప్పటి వరకు 40వేల ఎకరాల్లో మాత్రమే వరి మాసూళ్లు పూర్తయ్యాయి. ప్రకాశం జిల్లా కందుకూరు, కొండపి నియోజకవర్గాల్లో 44వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేశారు.
No comments