Crude oil : పెట్రోల్ ధరల కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం..సంపన్న దేశాల బాటలో భారత్....!!
release 5 million barrels of crude oil from strategic reserves : పెట్రోల్, డీజిల్ ధరలు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి.
బయటకు రావాలంటే వాహనం బయటకు తీయాల్సిందే. వాహనం బయటకు తీస్తే జేబులు ఖాళీ అయిపోతున్నాయి. వారం వచ్చేసరికి బ్యాంకు ఖాతా కూడా ఖాళీ అయిపోయేంతగా పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ.100కు ఏమాత్రం తగ్గకుండా రూ.108గా నడుస్తోంది. ఒక్కోరోజు ఇంతకంటే పెరుగుతోంది కూడా..ఇక పెట్రోల్ ధరలు ఇంతేనా..ఇలా బతకాల్సిందేనా..కష్టపడి సంపాదించుకున్న డబ్బంతా ఇలా పెట్రోల్ కు తగలేయాల్సిందేనా? అని సామాన్యుడు విలవిల్లాడిపోతున్నాడు.
పెట్రోల్ ధరలు తగ్గించటానికి కేంద్ర ప్రభుత్వం పలు విధాలుగా యోచిస్తోంది. పెట్రోల్, డిజిల్ ధరలపై కేంద్రం వ్యాట్ తగ్గించినా ఆయా రాష్ట్రాలు మాత్రం తగ్గించకపోవటంతో ఈ ధరలు జనాలను హడలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు ఏమాత్రం తగ్గటంలేదు. ఈక్రమంలో పెట్రోల్ ధరల కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది..!!
అత్యవసర నిల్వల నుంచి దాదాపు 50 లక్షల బ్యారెళ్ల ముడి చమురును బయటకు తీసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సంబంధిత శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. పెరుగుతున్న ధరల కట్టడి కోసం అమెరికా, జపాన్ సహా పెద్ద పెద్ద దేశాలన్నీ ఇదే ప్లాన్ ని అమలు చేస్తున్నాయి. అదే బాటలో భారత్ కూడా పయనించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తూర్పు, పశ్చిమ తీరాల్లో మూడు ప్రాంతాల్లో భారత్‌కు వ్యూహాత్మక నిల్వ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 3.8 కోట్ల బ్యారెళ్ల ముడి చమురును నిల్వ చేస్తున్నారు. వీటి నుంచి వచ్చే 7-10 రోజుల్లో చమురును బయటకు తీయనున్నట్లుగా సదరు అధికారి తెలిపారు.
ఈ చమురును 'మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్(ఎంఆర్‌పీఎల్)', హెచ్‌పీసీఎల్‌కు విక్రయించనున్నారు. ఈ రెండు రిఫైనరీలు వ్యూహాత్మక నిల్వ కేంద్రాలకు అనుసంధానమై ఉన్నాయి. తర్వాత మరింత చమురును కూడా విడుదల చేసే అవకాశం ఉందని అధికారి తెలిపారు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందన్నారు. ఇదే జరిగితే ఇక సామాన్యుడు కాస్త ఊపిరి తీసుకోగలడు. ఈ ధరాఘాతాలనుంచి కోలుకోగలడు.
No comments