Cyclone Alert: బంగాళాఖాతంలో తుపాను, ఏపీలో అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ...!!
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం ఎక్కువగా చెన్నైపై కనపడుతోంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కూడా వాయుగుండం ప్రభావంతో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
మంగళవారం ఏర్పడిన అల్పపీడనం బుధవారం ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా మారి, సాయంత్రానికి వాయుగుండంగా మారింది. దీంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా తడలో 7.5 సెంటీమీటర్లు, వాకాడులో 6, నాయుడుపేటలో 5.4 సెంటీమీటర్ల గరిష్ట వర్షపాతం నమోదైంది. ఇక గురువారం కూడా భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.
బుధవారం రాత్రి 9 గంటలకు చెన్నైకి 430 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 420 కిలోమీటర్ల తూర్పు ఆగ్నేయంగా వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి ఈరోజు సాయంత్రం శ్రీహరికోట-కరైకల్ మధ్య కడలూరు సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. వాయుగుండం తీరం దాటే సమయంలో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. తీరం దాటే వరకు తమిళనాడుతోపాటు దక్షిణకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఈరోజు నెల్లూరు, ప్రకాశంతోపాటు, చిత్తూరు, కడప జిల్లాల్లో కూడా సాధారణం నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. గుంటూరు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు, కృష్ణా నుంచి విశాఖ వరకు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు అంచనా వేశారు.
No comments