SBI Alert: ఖాతాదారులకు ఎస్బీఐ హెచ్చరిక.. కేవైసీ మోసాలతో అప్రమత్తంగా ఉండాలని సూచన..
ఇటీవల కాలంలో సైబర్ నేరాలు, మోసాలు పెరిగిపోతుండడంతో దేశీయ అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' తమ ఖాతాదారులను హెచ్చరించింది.
దేశంలో నమోదవుతున్న సైబర్ మోసాల్లో ఎస్‌బీఐ కస్టమర్లే అధికంగా ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా కేవైసీ వెరిఫికెషన్ పేరుతో కొందరు కేటుగాళ్లు ఎస్‌బీఐ కస్టమర్లను టార్గెట్‌గా చేసుకున్నారని, ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఏటీఎం కార్డ్ వ్యాలిడిటీ పూర్తయిందని, కేవైసీ వివరాలు అప్‌డేట్ చేయాలని, అలా చేయకపోతే ఏటీఎం కార్డ్ పనిచేయదని మాయామాటలు చెప్పే మోసగాళ్లను నమ్మవద్దని ఈ సందర్భంగా పేర్కొంది. ఈ మేరకు కేవైసీ మోసాలపై అవగాహన కల్పిస్తూ తమ అధికారిక ట్విట్టర్‌లో ఓ వీడియోను పంచుకుంది.
వాటిని క్లిక్ చేయద్దు..
'కొందరు మోసగాళ్లు తమను తాము బ్యాంకు రెప్రజెంటేటివ్స్‌గా చెప్పుకుని చెలామణీ అవుతున్నారు. ఎస్‌బీఐ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని ఎస్‌ఎంఎస్, వాట్సప్ ద్వారా వచ్చే కేవైసీ అప్‌డేట్ లింక్స్, అటాచ్‌మెంట్స్‌ని పంపుతున్నారు. ఒకవేళ మీకు ఇలాంటి మెసేజ్‌లు వస్తే వాటిని క్లిక్ చేయద్దు. అదేవిధంగా ఈ మోసాలపై వెంటనే https://www.cybercrime.gov.in/ కు ఫిర్యాదు చేయండి' అని ఈ సందర్భంగా ఎస్‌బీఐ ట్విట్టర్‌లో పేర్కొంది. ఈ సందర్భంగా తమ ఖాతాదారులకు కొన్ని ముఖ్యమైన సూచనలు జారీ చేసింది.
1. కేవైసీ అప్‌డేట్ కోసం బ్యాంకులు ఎలాంటి లింక్స్, అటాచ్‌మెంట్స్ పంపవు.
2. తెలియని వ్యక్తుల నుంచి ఎస్‌ఎంఎస్/ ఈ మెయిల్స్ లింక్స్, అటాచ్‌మెంట్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు.
3.అదేవిధంగా తెలియని వ్యక్తుల నుంచి ఫోన్‌కాల్స్, లింక్స్ ఆధారంగా ఎలాంటి మొబైల్ యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవద్దు.
4. ఆధార్ నంబర్, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, డెబిట్/ క్రెడిట్ కార్డు నంబర్, పిన్, సీవీవీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ/పాస్‌వర్డ్, ఓటీపీ తదితర వివరాలను ఎవరితో పంచుకోవద్దు.
No comments