AP News అమ్మఒడి కావాలంటే అది తప్పనిసరి-తల్లితండ్రులకు జగన్ సర్కార్ లేఖలు...!!!
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో అమ్మఒడి కూడా ఒకటి. ఆరంభంలో కచ్చితంగా అమలు చేసిన ఈ పథకానికి తాజాగా కష్టాలు మొదలయ్యాయి.
దీంతో ఈ పథకంలో కోతలు విధించేందుకు ప్రభుత్వం దారులు వెతుక్కోవాల్సి వస్తోంది. ఇందులో భాగంగా విద్యార్ధులకు 75 శాతం హాజరు నిబంధనను ప్రభుత్వం కచ్చితంగా అమలు చేసేందుకు సిద్దమవుతోంది.
ఈ విద్యాసంవత్సరానికి వచ్చే జనవరిలో ఇవాల్సిన అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వం వచ్చే ఏడాది జూన్ కు వాయిదా వేసేసింది. నిధుల కొరత కారణంగా జనవరికి బదులుగా జూన్ లో ఈ పథకం కింద ఇచ్చే రూ. 15 వేలు ఇవ్వబోతోంది. అయితే ఇందుకు కూడా 75 శాతం హాజరు నిబంధనను తప్పనిసరి చేసింది. ఈ విద్యాసంవత్సరంలో 75 శాతం హాజరు ఉన్న విద్యార్దుల తల్లులకు మాత్రమే అమ్మఒడి డబ్పులు అందుతాయి. ఇందులో ఎక్కడైనా తేడా వస్తే అంతే సంగతులు. ఇదే విషయాన్ని ప్రభుత్వం ముందుగానే తల్లులకు చెప్పేస్తోంది.
వచ్చే ఏడాది జూన్ లో అమ్మఒడి డబ్బులు కావాలంటే తమ పిల్లలకు ఏప్రిల్ తో ముగిసే ఈ విద్యాసంవత్సరంలో 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలనే నిబంధనను లేఖల రూపంలో తల్లితండ్రులకు పంపుతోంది. ఈ మేరకు తయారు చేసిన లేఖల్ని విద్యార్దులకు ఇచ్చి తల్లితండ్రులతో సంతకాలు చేయించుకురావాలని ప్రధానోపాధ్యాయులు కోరుతున్నారు. దీంతో ఇప్పుడు అమ్మఒడి పథకం కావాలనుకునే తల్లితండ్రులు.. ఈ లేఖలపై సంతకాలు చేసి పంపాల్సి ఉంటుంది. ఈ విద్యాసంవత్సరం ముగిసే ఏప్రిల్ నెలలో విద్యార్ధుల హాజరు పరిశీలించి 75 శాతం ఉన్న వారికి మాత్రమే జూన్ లో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభ సమయంలో ప్రభుత్వం అమ్మఒడి మొత్తాల్సి బదిలీ చేయబోతోంది. దీంతో విద్యార్ధుల తల్లితండ్రులకు ఇప్పటి నుంచే టెన్షన్ మొదలైంది.
75 శాతం హాజరు నిబంధనను విద్యాసంవత్సరం ప్రారంభంలో చెప్పకుండా ఇప్పుడు మధ్యలో చెప్పడంపై కొందరు తల్లితండ్రులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది కచ్చితంగా తమను మోసం చేయడమేనంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికే జనవరిలో ఇవ్వాల్సిన అమ్మఒడి మొత్తాన్ని జూన్ కు బదిలీ చేసేసింది. ఇప్పుడు ఈ షరతులతో తమకు అమ్మఒడి వస్తుందా రాదా అన్న భయం వారిలో కనిపిస్తోంది.
No comments