AP Weather: ఏపీని వెంటాడుతున్న వర్షం...... ఆ జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక....!!
ఆంధ్రప్రదేశ్‌ను వరుణుడు వెంటాడుతున్నాడు. మొన్నటి జల విలయం నుంచి కోలుకోక ముందే మరో వాయుగుండం తరుముకొస్తోంది. అవును, ఏపీకి మరో ముప్పు పొంచి ఉందని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది.
12గంటల్లో మరో అల్పపీడనం ఏర్పడనుందని, అది 48గంటల్లో బలపడి వాయుగుండంగా మారనుందని భారత వాతావరణశాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో రాయలసీమ, కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది.
డిసెంబర్ మూడు వరకు అత్యంత భారీ వర్షాలు పడే అవకాశముందని ఐఎండీ అంటోంది. ఇప్పటికే, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయని అధికారులు తెలిపారు. అల్పపీడనం వాయుగుండంగా మారితే చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో మళ్లీ ఏడు నుంచి 20 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశముందని అలర్ట్ చేసింది. ఐఎండీ హెచ్చరికలతో రాయలసీమ, కోస్తాంధ్రలో అధికారులు ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.
ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని… విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో గురువారం, శుక్రవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని పేర్కొంది. గురువారం నుంచి రెండు రోజులపాటు కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురవనుండగా.. ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులు మరో రెండు రోజులవరకు వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు.
No comments