Latest

Loading...

ముందు ప్రధానోపాధ్యాయుడు రుచి చూశాకే పిల్లలకు వడ్డించాలి


 పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని ఇకపై ప్రధానోపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయుడు రుచి చూడాల్సిందే. ఆ ఆహారం బాగుంటేనే విద్యార్థులకు వడ్డించాలి.


ఈ మేరకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. మధ్యాహ్న భోజనాన్ని ముందుగా ప్రధానోపాధ్యాయుడు రుచి చూసి రిజిస్టర్‌లో నమోదు చేయాలని, ఆ తర్వాతే పిల్లలకు వడ్డించాలని, ఈ విధానాన్ని ప్రతిరోజూ పాటించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ శ్రీదేవసేన మంగళవారం మార్గదర్శకాలను విడుదల చేశారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించిన వంటకాల్లో నాణ్యమైన డబుల్‌ ఫోర్టిఫైడ్‌ ఉప్పును మాత్రమే వినియోగించాలని తెలిపారు. టేస్టింగ్‌ రిజిష్టర్‌తోపాటు, బియ్యం నిల్వలు, పంపిణీ, స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ మీటింగ్‌ మినిట్స్‌, భోజనాన్ని స్వీకరించిన వారి రిజిస్టర్లను వేర్వేరుగా నిర్వహించాలని మార్గదర్శకాల్లో తెలిపారు.


మార్గదర్శకాల్లో ప్రధానాంశాలు


విద్యార్ధులకు నాణ్యమైన భోజనం అందించేలా మధ్యాహ్న భోజన పథకం వివరాలు, మెనూను గోడమీద రాయించాలి. మెనూ ప్రకారమే విద్యార్థులకు భోజనం అందజేయాలి. వారానికి మూడు కోడిగడ్లు తప్పనిసరిగా ఇవ్వాలి. ఇందుకు సంబంధించి వంట ఏజెన్సీ నుంచి లిఖిత పూర్వక ఒప్పంద పత్రాన్ని తీసుకోవాలి.

రోజుకు ఎంతమంది విద్యార్థులు భోజనం తీసుకొంటున్నారో వారి వివరాలను ఎస్‌ఎంఎస్‌ ద్వారా పంపాలి.

ఆయా పాఠశాలల విద్యార్థులతో మధ్యాహ్న భోజన కమిటీని ఏర్పాటు చేయించాలి. బియ్యం, ఇతర సరుకులను విద్యార్థులతోనే తూకం వేయించి, రిజిష్టర్లో నమోదు చేయించాలి.

బియ్యం నిల్వల్లో ఏదైనా తేడాలుంటే ప్రధానోపాధ్యాయుడు బాధ్యత వహించాలి.

వేడిగా ఉన్న ఆహారాన్ని మాత్రమే విద్యార్థులకు అందజేయాలి. ఆహారం, మంచినీరు కలుషితం కాకుండా జాగ్రత్త వహించాలి. వంటపాత్రలు, ప్లేట్లు శుభ్రంగా ఉండేలా చూడాలి.

వంద శాతం విద్యార్థుల ఆధార్‌ నంబర్లు నమోదయ్యేలా చర్యలు చేపట్టాలి.

పాఠశాలలో తప్పనిసరిగా కిచెన్‌ గార్డెన్‌ అభివృద్ధి చేసేందుకు ప్రధానోపాధ్యాయులు చొరవ తీసుకోవాలి. భోజనంలో పోషకాలుండేలా చూడాలి. మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఎస్‌ఎంసీ సమావేశాల్లో సమీక్షించాలి.

No comments

Powered by Blogger.