రేపు రంగంలోకి జగన్ - ఉద్యోగులు మాట వింటారా ? రెండేళ్ల పోరుకు ఇద్దరూ సిద్ధపడతారా... ?
ఏపీలో రెండున్నరేళ్ల క్రితం అధికారంలోకి రావడానికి వైఎస్ జగన్ ఉద్యోగులకు పలు హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చాలని ఉద్యోగులు కోరగా..
అధ్యయనానికి కమిటీలు నియమించారు. ఎంతకీ ఈ కమిటీలు పీఆర్సీపై కానీ, సీపీఎస్ రద్దుపై కానీ తేల్చకపోవడంతో ఉద్యోగులు పోరుబాట పట్టారు. ఈ నేపథ్యంలో జగన్ ఆదేశాలతో తాజాగా రంగంలోకి దిగిన అధికారులు పీఆర్సీ రిపోర్ట్ ఇచ్చేశారు. అయితే ఉద్యోగుల్లో ఇది తీవ్ర నిరాశ రేపింది. దీంతో రేపు జగన్ వారిని బుజ్జగించేందుకు నేరుగా రంగంలోకి దిగుతున్నారు.
ఉద్యోగులకు జగన్ హామీలు
జగన్ మాట ఇస్తే తప్పరు, మడమ తిప్పరన్న భావనతో ఉద్యోగులు రెండున్నరేళ్ల క్రితం వైసీపీ సర్కార్ కు ఏర్పాటుకు పూర్తిగా తోడ్పాటు అందించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ కూడా అందరు ముఖ్యమంత్రుల్లాగే తమకు ఇచ్చిన హామీల్ని
విస్మరించారన్న భావన ఉద్యోగుల్లో పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం వారికి గతంలో ఇచ్చిన పీఆర్సీ హామీ అమలుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తొలుత పీఆర్సీ నివేదిక వెల్లడైంది. అయితే ఇందులో 14.29 శాతం ఫిట్ మెంట్ మాత్రమే ఇవ్వడం చిచ్చు రేపుతోంది.
పీఆర్సీ రిపోర్ట్ పై ఉద్యోగుల గుర్రు
వైసీపీ అధికారంలోకి వస్తే భారీగా పీఆర్సీ ఇస్తామని గతంలో జగన్ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే రెండున్నరేళ్లు కాలక్షేపం చేసి ఇప్పుడు వారికి 14.29 శాతం ఫిట్ మెంట్ ప్రకటించేసరికి ఉద్యోగులకు ఎక్కడో కాలుతోంది. దీంతో నిన్న మొన్నటి వరకూ 46 శాతం ఫిట్ మెంట్ కు ఓకే చెప్పిన ఉద్యోగ సంఘాలు కాస్తా ఇప్పుడు 55 శాతం ఇవ్వాల్సిందేనంటున్నాయి. అధికారుల కమిటీ సిఫార్సు చేసిన 14.29 ఫిట్ మెంట్ ఇచ్చేందుకే తంటాలు పడుతున్న ప్రభుత్వానికి ఉద్యోగుల డిమాండ్ పుండుమీద కారంలా మారబోతోంది.
సజ్జలతో చర్చలు విఫలం
తాము ప్రభుత్వానికి ఇచ్చిన 71 డిమాండ్లలో పీఆర్సీ, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై ఇవాళ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో ఉద్యోగ సంఘాలు భేటీ అయి చర్చించాయి. అయితే ఇందులోనూ ఏమీ తేలలేదు. పీఆర్సీపై జగన్ చూసుకుంటారనే హామీ, సీపీఎస్ రద్దు సాధ్యం కాదనే వాస్తవం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సుప్రీంకోర్టు తీర్పు అడ్డంకి అనే సాకు ఉద్యోగులకు మంట పుట్టించాయి. దీంతో సజ్జలతో చర్చల్ని అసంపూర్తిగానే ముగించి ఉద్యోగులు బయటికి వచ్చేశారు. దీంతో ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య పీఆర్సీతో మొదలైన రచ్చ మిగతా అంశాలకూ పాకే సూచనలు కనిపిస్తున్నాయి.
రేపు జగన్ తో ఉద్యోగుల భేటీ
తాము ప్రకటించిన పీఆర్సీ నివేదికపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారనే వార్తల నేపథ్యంలో సీఎం జగన్ నేరుగా రంగంలోకి దిగుతున్నారు. రేపు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో భేటీ కాబోతున్నారు. ఇందులో పీఆర్సీ ఫిట్ మెంట్ వ్యవహారాన్ని ముందుగా తేల్చబోతున్నారు. పీఆర్సీ రిపోర్ట్ ప్రకారం ఉద్యోగులకు 14.29 ఫిట్ మెంట్ సరిపోతుందని చెప్పగా.. ఉద్యోగులు మాత్రం 55 శాతం ఇవ్వాలని కోరుతున్నారు. అదీ 2018 నుంచే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో సీఎం జగన్ ఇప్పుడు వారికి ఏం హామీ ఇవ్వబోతున్నారనేది కీలకంగా మారింది. జగన్ మాట విని రాజీ పడితే ఉద్యోగ సంఘాలకు ఉద్యోగుల పోరు తప్పదు. అలాగని ప్రభుత్వానికి ఎదురుతిరిగితే రెండేళ్ల పాటు పోరాడాల్సిన పరిస్ధితి. దీంతో జగన్, ఉద్యోగ సంఘాల భేటీ కీలకంగా మారిపోయింది.
రెండేళ్ల పోరుకు సిద్ధమేనా ?
ఏపీలో ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం ముందుకెళ్లలేని పరిస్ధితి. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి ఓవైపు, రాజకీయంగా ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడం, ఇతరత్రా కారణాలతో ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో సానుకూలంగా వ్యవహరించలేని పరిస్ధితి. దీంతో ప్రభుత్వంపై ఉద్యోగులు ఒత్తిడి పెంచేందుకు కూడా వీలు కావడం లేదు. అయితే ఈ రెండున్నరేళ్లలో ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేరని నేపథ్యంలో ఉద్యోగుల నుంచి సంఘాల నేతలపై తీవ్ర ఒత్తిడి ఉంది. తాము పోరాటానికి సిద్ధంగా ఉన్నామని, హామీలు నెరవేర్చాలని పట్టుబట్టాల్సిందేనని ఉద్యోగులు వారిపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో ఇప్పుడు ప్రభుత్వంపై ఉద్యోగసంఘాల నేతలు కత్తులు నూరుతున్నారు. మరో రెండేళ్ల పాటు పోరాడితే ఎలాగో ఎన్నికలు ఉంటాయి. అప్పుడు తమ ఓట్ల కోసమైనా ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందనే ఆలోచనలో వారు ఉన్నారు. అలాగే ప్రభుత్వం కూడా ఈ రెండేళ్లు ఎలాగోలా నెట్టుకొస్తే చివరి ఏడాదిలో ఉద్యోగులకు తాయిలాలు ప్రకటించవచ్చనే ఆలోచనలో ఉంది. ఆలోపు రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి కూడా కుదురుకుంటుందని ఆశాభావంగా ఉంది. దీంతో ఎవరికి వారు పట్టు సడలించకపోవచ్చని తెలుస్తోంది.
No comments