Insurance for EPO Members | ఈపీఎఫ్‌వో సభ్యులకు 7 లక్షల బీమా...!!
Insurance for EPO Members | ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లో సభ్యులకు సంస్థ శుభవార్త అందించింది. ఎటువంటి ప్రీమియం చెల్లించకుండానే రూ.7 లక్షల ఉచిత బీమా కవరేజీ కల్పిస్తున్నది.
ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీం (ఈడీఎల్ఐ) కింద ఈ సౌకర్యం లభిస్తుంది. ఒకవేళ విధులు నిర్వహిస్తున్నప్పుడు మరణిస్తే సదరు సభ్యుల నామినీ లేదా వారసులకు రూ.7 లక్షల వరకు చెల్లిస్తారు. ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ (ఈపీఎఫ్) అండ్ మిస్‌లేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్-1976 కింద ఈపీఎఫ్‌వో సభ్యుల పేర్లు ఆటోమేటిక్‌గా ఈడీఎల్ఐ స్కీమ్‌లో నమోదవుతాయి. ఈ ఫెసిలిటీ పొందడానికి ప్రీమియం చెల్లించడం గానీ, ఇతర ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సిన అవసరం గానీ లేదు.
ఇన్సూరెన్స్ కవరేజీ ఇలా
సభ్యుడి మరణానికి ముందు 12 నెలలు తీసుకునే వేతనం ఆధారంగా ఇన్సూరెన్స్ కవరేజీ ఉంటుంది. సంబంధిత సంస్థ యాజమాన్యం చెల్లించే ఈపీఎఫ్‌వో 12 శాతంలో 8.33 శాతం పెన్షన్ ఫండ్‌కు మళ్లిస్తారు. అంతే కాదు ఈడీఎల్ఐ స్కీం కోసం యాజమాన్యాలు 0.5 శాతం చెల్లిస్తాయి. తమ సభ్యులకు ఈపీఎఫ్‌వో-ఈడీఎల్ఐలో లభించే ఉచిత బీమా సౌకర్యం, అందులో ముఖ్యాంశాలు తెలియజేస్తూ ట్వీట్ చేసింది. అవేంటో చూద్దాం..
గరిష్ఠ బెనిఫిట్లు ఇలా
విధులు నిర్వర్తిస్తుండగా ఈపీఎఫ్‌వో సభ్యుడు మరణించినట్లయితే నామినీ లేదా వారసులకు రూ.7 లక్షల బెనిఫిట్ లభిస్తుంది. ఇంతకుముందు ఇది రూ.6 లక్షలు చెల్లించేవారు. గత ఏప్రిల్ నుంచి రూ.7 లక్షలకు పెంచారు.
ఇలా కనిష్ట బెనిఫిట్లు
ఈఎల్‌డీఐ -1976 నిబంధన కింద ఈపీఎఫ్‌వో సభ్యుల నామినీకి రూ.2.5 లక్షల మేరకు కనిష్ఠ లబ్ధి చేకూరుస్తారు. మరణానికి ముందు తీసుకున్న 12 నెలల వేతనం ఆధారంగా దీన్ని నిర్ణయిస్తారు.
12 నెలల మొత్తం వేతనంలో సగటుపై 30 రెట్లు గానీ, గరిష్ఠంగా రూ.7 లక్షలు గానీ ఇన్సూరెన్స్ కవరేజీ లభిస్తుంది. సగటు నెలవారీ వేతనం బేసిక్ వేతనం ప్లస్ కరువు భత్యం కలిపి నిర్ణయిస్తారు. ఈ స్కీం కింద రూ.2.5 లక్షల బోనస్ కూడా చెల్లిస్తారు. ఈడీఎల్ఐ కల్పిస్తున్న బీమా కవరేజీలో ఎటువంటి మినహాయింపులు ఉండవు.
ఆటోమేటిక్‌గా ఈడీఎల్ఐలో పేర్ల నమోదు
పీఎఫ్, ఈపీఎఫ్ ఖాతాదారులకు ఉచితంగా జీవిత బీమా కవరేజీ లభిస్తుంది. సంబంధిత సభ్యుడి యాజమాన్యం నెలవారీ వేతనంలో 0.50 శాతం చెల్లిస్తారు. పీఎఫ్, ఈపీఎఫ్ ఖాతాదారుల పేర్లు ఈడీఎల్ఐ బీమా స్కీమ్‌లో ఆటోమేటిక్‌గా నమోదవుతాయి. సభ్యుడు మరణించిన తర్వాత సంబంధిత నామినీ లేదా వారసుల ఖాతాలోకి ఈ మొత్తం ప్రత్యక్ష నగదు బదిలీ అవుతుంది.
వాటా చెల్లించాల్సింది యాజమాన్యాలే
అయితే, ఈపీఎఫ్‌వోలో సభ్యుడు లేదా సభ్యురాలు.. ఈపీఎఫ్ రిజిస్టర్డ్ కంపెనీ నుంచి వైదొలిగితే మాత్రం నామినీ గానీ, వారసులు గానీ.. బీమా కవరేజీ కోసం క్లయిమ్ చేసే హక్కు లేదు. ఈడీఎల్ఐకి యాజమాన్యాలు మాత్రమే తమ వాటా చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగుల వేతనం నుంచి మినహాయించుకోరాదు.
No comments