లాక్ డౌన్ దిశగా- రాత్రి కర్ఫ్యూ : ఓమిక్రాన్ పై ప్రధాని సమీక్ష- కఠిన నిర్ణయాలు తప్పవంటూ..!!
ఒమిక్రాన్ నియంత్రణకు కఠిన చర్యలు తప్పవా. దేశంలో మరోసారి కర్ఫ్యూ విధింపు దిశగా నిర్ణయాలు జరగబోతున్నాయా. ఈ రోజు ప్రధాని ఎటువంటి నిర్ణయాలు ప్రకటిస్తారు.
ప్రపంచ దేశాలను దేశాలను టెన్షన్ పెడుతున్న ఒమిక్రాన్ ఇప్పుడు భారత్ లోనూ క్రమేణా వ్యాపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఓమిక్రాన్ కేసులు గుర్తించారు. ఏపీలో రెండు.. తెలంగాణలో 24 ఒమిక్రాన్ కేసులను నిర్ధారించారు. ఇక, దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 213 కేసులు అధికారికంగా గుర్తించారు. ఇప్పటికే కేంద్రం రాష్ట్రాలను ఒమిక్రాన్ నేపథ్యంలో కీలక సూచనలు చేసింది. కంటైన్మెంట్ జోన్ల గురించి సూచనలు చేసింది.
అవసరమైతే రాత్రి సమయాల్లో కర్ఫ్యూ అమలు చేయాలని సూచించింది. ఇక, కేసులు పెరుగుతున్న వేళ..ప్రధాని మోదీ ఈ రోజు అత్యున్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేసారు. దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల పెరుగుదల గురించి చర్చించటంతో పాటుగా.. మరింతగా వ్యాపించకుండా కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అందులో భాగంగా బూస్టర్ డోసులతో పాటుగా కఠిన ఆంక్షల అమలుకు నిర్ణయించే ఛాన్స్ ఉంది. కేసులు పెద్ద మొత్తంలో వస్తున్న ప్రాంతాల్లో రాత్రి కర్ఫ్యూ అమలుకు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
వేడుకలు..జన సమూహాల పైన ఆంక్షలు
పండుగ సీజన్ కావటంతో మరింతగా జన సమూహాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవంటం పైనా కేంద్రం పదే పదే రాష్ట్రాలకు సూచనలు చేస్తోంది. 15 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో 57 కేసులు, మహారాష్ట్రలో 54, తెలంగాణలో 24, కర్ణాటకలో 19, రాజస్థాన్‌లో 18, కేరళలలో 15, గుజరాత్‌లో 14.. ఇలా మొత్తంగా 15 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. అయితే, ఇప్పటి వరకు 90 మంది రికవరీ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఓవైపు వ్యాక్సినేషన్‌లో వేగం పెంచుతూనే మరోవైపు కట్టడి చర్చలపై ఫోకస్ పెట్టనున్నారు. దీనికోసం.. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌పై ఆంక్షలు విధించేందుకు సిద్ధం అయ్యారు.
బూస్టర్ డోసులు.. పరీక్షల పెంపు పైనా
అవసరమైతే.. ప్రజలు గుంపులుగా ఒకేచోటికి చేరే అవకాశం లేకుండా.. కర్ఫ్యూ, లాక్‌డౌన్ లాంటి కఠిన నిర్ణయాలను కూడా తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. కోవిడ్-19 టెస్ట్‌లను పెంచాలని.. నైట్ లాక్‌డౌన్‌ల వంటి దశలను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. ఒక వారంలో అన్ని పరీక్షలలో 10 శాతం కంటే ఎక్కువ పాజిటివ్ రేటు నమోదైతే.. లేదా హాస్పిటల్ బెడ్‌ల ఆక్యుపెన్సీ సామర్థ్యంలో 40 శాతం దాటితే ప్రజలు గుమిగూడే అవకాశం ఉన్న సమావేశాలపై నిషేధం విధించాలని కేంద్రం సూచించింది.
ప్రధాని నిర్ణయాలపై ఆసక్తి
24 గంటల్లో బ్రిటన్‌లో రికార్డ్ స్థాయిలో 1,06,122 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదవ్వడం ఇదే మొదటిసారి. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. కరోనా అనుభవాలను ఎదుర్కొన్న నేపథ్యంలో ఒమిక్రాన్ వ్యాప్తిని తొలి దశలోనూ పూర్తిగా నియంత్రించేందుకు కఠిన చర్యల దిశగా నిర్ణయాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. దీంతో..ఈ రోజు ప్రధాని నిర్వహించే సమీక్ష పైన ఆసక్తి నెలకొని ఉంది.
No comments