Omicron variant | గుడ్‌న్యూస్.. ఈ ఒక్క ట్రీట్‌మెంట్‌తో ఒమిక్రాన్ ఖతం....!!
omicron variant antibody drug | కరోనా వైరస్ ఎప్పటికప్పుడు కొత్త రూపంలోకి మారుతూ ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. ఇప్పటివరకు ఉన్న వేరియంట్లతో పోలిస్తే మరింత చురుగ్గా మారిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు ప్రజలపై విరుచుకుపడుతోంది.
వేగంగా వ్యాప్తి చెందడమే కాదు.. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్న వారిలోనూ ఈ మ్యుటేషన్ సోకుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి సమయంలో బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ఔషధ సంస్థ గ్లాస్కోస్మిత్ క్లైన్ (జీఎస్‌కే) ప్రజలకు శుభవార్త చెప్పింది. ఒమిక్రాన్ వేరియంట్ ముప్పును తగ్గించే సరికొత్త యాంటీబాడీ ట్రీట్‌మెంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది.
ఫస్ట్, సెకండ్ వేవ్ సమయంలో కొవిడ్-19 సోకిన బాధితుల్లో ఎవరిలోనైనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండి ప్రాణాపాయ స్థితిలో ఉంటే వారికి మోనోక్లోనల్ యాంటీబాడీ ట్రీట్‌మెంట్ అందించారు. ఈ ట్రీట్‌మెంట్ వల్ల కేవలం 24 గంటల్లోనే కరోనా వైరస్ నుంచి వారు కోలుకున్నారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండి ఆస్పత్రి పాలైన కరోనా రోగులను ప్రాణాపాయం నుంచి గట్టెక్కించేందుకు ఈ చికిత్స ఎంతగానో దోహదపడింది. కానీ మిగిలిన ఉత్పరివర్తనాలతో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్‌లో 30కి పైగా మ్యుటేషన్లు కేవలం స్పైక్ ప్రోటీన్ ( కొమ్ము)లోనే ఉండటంతో ఆ యాంటీబాడీ చికిత్స ఫలితం చూపకపోవచ్చని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఒమిక్రాన్ వేరియంట్‌లోని 37 ఉత్పరివర్తనాలను సమర్థంగా అణచివేసేలా సొట్రోవిమాబ్ ( sotrovimab ) అనే యాంటీబాడీ చికిత్సను కనుగొన్నట్లు గ్లాస్కోస్మిత్ క్లైన్ సంస్థ వెల్లడించింది. న్యూయార్క్‌లోని వీర్‌బయోటెక్నాలజీ సంస్థతో కలిసి ఈ డ్రగ్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది.
సొట్రోవిమాబ్ ( sotrovimab ) యాంటీబాడీ డ్రగ్ ( antibody drug )ను అందుబాటులోకి తీసుకురావడానికి ముందు ఒమిక్రాన్ ( Omicron variant )ను పోలిన వైరస్‌ను ల్యాబ్‌లో తయారు చేశారు. దానిపై ఈ యాంటీబాడీ డ్రగ్‌ను ప్రయోగించారు. అప్పుడు దాని మ్యుటేషన్లు అన్నీ సమర్థంగా అణిచివేయబడ్డాయని గ్లాస్కోస్మిత్ క్లైన్ సంస్థ వెల్లడించింది. తమ పరిశోధనలో భాగంగా స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్న కొవిడ్ బాధితులకు సొట్రోవిమాబ్ యాంటీ బాడీ డ్రగ్‌ను అందించారు. దీంతో వారిలో ఆస్పత్రి పాలయ్యే, మరణాల ముప్పు 79 శాతం వరకు తగ్గిందని వీర్‌బయోటెక్నాలజీ సంస్థ సీఈవో జార్జ్ స్కాన్గోస్ వెల్లడించారు. ఈ ఔషధానికి ఇప్పటికే బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ ఈ డ్రగ్‌కు అనుమతులు మంజూరు చేసింది. బాధితుల్లో లక్షణాలు ప్రారంభమైన ఐదు రోజుల్లోనే దీన్ని అందించాలని సూచించింది.
No comments