Omicron: ముక్కు కారటం, తలనొప్పి, అలసట....ఒమిక్రాన్ లక్షణాలు...!
విశ్లేషించిన లండన్‌లోని ZOE వ్యవస్
లండన్: కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే 90 దేశాల్లో ఈ కేసులు వెలుగుచూడగా..
ఆయా దేశాల్లో రోజురోజుకు కొత్త కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు ఈ వేరియంట్ లక్షణాలపై ఇంకా స్పష్టతలేదు. లక్షణాలపై పూర్తి సమాచారం తెలుసుకునేందుకు మరిన్ని రోజులు పట్టొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ కొద్దిరోజుల క్రితమే పేర్కొంది. అయితే కొవిడ్ లక్షణాలను అంచనా వేసేందుకు బ్రిటన్‌లోని లండన్ అధికారులు రూపొందించిన జో (ZOE) వ్యవస్థ ద్వారా ఒమిక్రాన్ లక్షణాలను విశ్లేషించినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. ముక్కు కారటం, తలనొప్పి, అలసట, తుమ్ములు, గొంతు నొప్పి.. ఇవే కొత్త వేరియంట్ లక్షణాలని పేర్కొంది. సాధారణ జలుబుకు ఉండే లక్షణాలు ఉన్నట్లు తెలిపింది.
బ్రిటన్‌లో ఒమిక్రాన్ సోకి ఆసుపత్రులు, ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న అనేక మంది తెలిపిన వివరాల ప్రకారం వారు ఈ జాబితాను వెలువడించారు. ప్రమాదకర డెల్టా వేరియంట్‌కు ఉండే నిరంతర దగ్గు, అధిక ఉష్ణోగ్రత, రుచి సహా వాసన కోల్పోవడం వంటి లక్షణాలేవీ లేవని కనుగొన్నారు. 'జలుబు లక్షణాలైన ముక్కు కారటం, తలనొప్పి, గొంతు నొప్పి, తుమ్ములు వంటి లక్షణాలు ఉంటే ప్రజలు కొవిడ్‌గా భావించి ఇంట్లోనే ఉండాలి' అని ZOE వ్యవస్థ ప్రధాన శాస్త్రవేత్త టిమ్ స్పెక్టర్ సూచించారు. క్రిస్మస్ పండగ సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి లక్షణాలు ఉండే స్నేహితులు, బంధువులకు దూరంగా ఉండాలని కోరారు.
ఒమిక్రాన్ కేసులు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. 89 దేశాల్లో ఈ వేరియంట్‌ను గుర్తించినట్లు డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. డెల్టా వేరియంట్ కన్నా ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు తెలిపింది. ముఖ్యంగా బ్రిటన్‌లో దీని ఉద్ధృతి కొనసాగుతోంది. రోజూ వేల సంఖ్యలో ఈ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన రెండురోజుల్లో 10 వేలకు పైగా కొత్త కేసులు నిర్ధరణ అయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. గత వారంతో పోలిస్తే ఈ వారం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారు 28.6 శాతం పెరిగినట్లు ప్రభుత్వ నివేదికలు తెలుపుతున్నాయి.
No comments