SBI Debit Card: ఎస్‌బీఐ డెబిట్ కార్డు పోయిందా?రెండే నిమిషాల్లో బ్లాక్ చేయండి...!
నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి పెట్రోల్ వరకు ఏది కొనుగోలు చేసినా కార్డులతో పేమెంట్ చేసేస్తున్నారు. బయటకు వెళ్లాలంటే పర్సులో నగదు మాటేమో గానీ, కార్డు మాత్రం తప్పకుండా ఉండాల్సిందే.
అనుకోకుండా కార్డు పోతే బ్యాంకుకు వెళ్లి కార్డు బ్లాక్ చేసే లోపు అందులో ఉన్న మొత్తం కాజేస్తారేమో అని భయపడుతుంటారు. కానీ ఇప్పుడు ఆ భయం అవసరం లేదు. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కార్డును బ్లాక్ చేసే సదుపాయాన్ని ప్రస్తుతం చాలా వరకు బ్యాంకులు అందిస్తున్నాయి. ఎస్‌బీఐ కూడా తమ వినియోగదారులకు ఈ సౌకర్యాన్ని చాలా కాలం నుంచి అందిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ విధానాన్ని మరింత సులభతరం చేస్తూ ఐవీఆర్ సిస్టమ్ ద్వారా కార్డుని సులభంగా బ్లాక్ చేయడంతో పాటు కొత్త కార్డును పొందే సదుపాయాన్ని అందిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉండాలంటే ఎస్‌బీఐ కస్టమర్లు తమ బ్యాంకు ఖాతాతో మొబైల్ నంబరును తప్పకుండా రిజిస్టర్ చేసుకోవాలి. లేదంటే బ్యాంకుకు పరుగు తీయాల్సిందే.
డెబిట్ కార్డు బ్లాక్ చేసేందుకు సులభమైన మార్గాన్ని తీసుకొచ్చింది. 1800 1234 నెంబరుకి కాల్ చేసి ఐవీఆర్ సిస్టమ్ ద్వారా ఇచ్చే సూచనలను అనుసరిస్తే కార్డును బ్లాక్ చేయడంతో పాటు కొత్త కార్డును పొందచ్చు.
కార్డును ఎలా బ్లాక్ చేయాలి..
* ముందుగా రిజిస్టర్డ్ సెల్‌ఫోన్ నెంబరు నుంచి 1800 1234 టోల్-ఫ్రీ నంబరుకు డయిల్ చేయాలి.
* కార్డు బ్లాక్ చేసేందుకు 0 పై ప్రెస్ చేయాలి.
* ఇక్కడ మీకు రెండు ఆప్షన్లు కనిపిస్తాయి.
- రిజిస్టర్డ్ మొబైల్ నంబరు, కార్డు నంబరుతో కార్డు బ్లాక్ చేయాలనుకుంటే 1ని,
- రిజిస్టర్డ్ మొబైల్ నంబరు, ఖాతా నంబరుతో కార్డును బ్లాక్ చేయాలంటే 2ని ప్రెస్ చేయాలి.
* మీరు 1 ప్రస్ చేసి రిజిస్టర్డ్ మొబైల్ నంబరు, కార్డు నంబరుతో కార్డు బ్లాక్ చేయాలనుకుంటే..ఏటీఎమ్ కార్డు చివరి 5 అంకెలను ఎంటర్ చేసి, ధృవీకరించేందుకు 1 నొక్కాలి. ఇప్పుడు బ్లాక్ చేయాల్సిన ఏటీఎమ్ కార్డు చివరి 5 అంకెలను మరోసారి ఎంటర్ చేసి 2 నొక్కాలి. కార్డు చివరి 5 అంకెలు మీకు గుర్తుంటేనే ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది
* ఒకవేళ మీకు కార్డు చివరి 5 నంబర్లు గుర్తులేకపోతే ఖాతా నంబరుతో కూడా బ్లాక్ చేయవచ్చు. ఇందుకోసం 2 నంబరును నొక్కి, ఖాతా నంబర్‌లోని చివరి ఐదు అంకెలను నమోదు చేసి, ధృవీకరించేందుకు 1ని నొక్కాలి. ఖాతా నంబరులోని చివరి ఐదు అంకెలను మరోసారి ఎంటర్ చేసి 2 నొక్కాలి.
* ఈ రెండింటిలో ఏది ఫాలో అయినా కార్డును బ్లాక్ చేయవచ్చు. విజయంతంగా బ్లాక్ చేసినట్లు మీ ఫోన్‌కి మెసేజ్ వస్తుంది.
* ఒకవేళ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు ఒకటి కంటే ఎక్కువ డెబిట్ కార్డులు లింక్ చేసి ఉంటే బ్లాకింగ్ కోసం మీ కాల్ ఎస్‌బీఐ ఏజెంట్‌కి బదిలీ అవుతుంది.
కార్డుని రీప్లేస్ చేయాలంటే..
* కార్డు బ్లాకింగ్ పూర్తయిన తరువాత కొత్త కార్డు పొందాలకనుంటే 1ని ప్రెస్ చేసి పుట్టిన తేది ఎంటర్ చేయాలి. దృవీకరించేందుకు '1', రిక్వెస్ట్ క్యాన్సిల్ కోసం '2' ప్రెస్ చేయాలి.
* కార్డు మీ రిజిస్టర్డ్ చిరునామాకి పంపుతారు. రీప్లేస్‌మెంట్ ఛార్జీలు వర్తిస్తాయి
No comments