Latest

Loading...

USA first covid pill : కరోనా చరిత్రలో మరో మైలురాయి తొలి ట్యాబ్లెట్ Paxlovidకు FDA ఆమోదం...!!

USA first covid pill

 కరోనా వైరస్ పై మానవుడు సాగిస్తోన్న పోరాటం ఇవాళ మరో మైలురాయిని దాటింది. సరిగ్గా రెండేళ్ల కిందట చైనాలోని వూహాన్ నగరం నుంచి పుట్టుకొచ్చిన కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని చాపచుట్టేసి 53.9లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. దాదాపు ఏడాది కిందట వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా, దాని తయారీ, పంపిణీలో సంక్లిష్టతల కారణంగా చిట్టచివరి మనిషికీ టీకాలు అందడంలేదు.


అదీగాక చాలా మందిలో టీకాలపై ఉన్న తప్పుడు అభిప్రాయాలను పోగొట్టడం ప్రభుత్వాలకు సమస్యగా మారింది. డెల్టా, ఇతర వేరియంట్ల ఉధృతి తగ్గుతుందనుకునేలోపే సౌతాఫ్రికా నుంచి పుట్టుకొచ్చిన ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచానికి కొత్త ముప్పుగా వాటిల్లింది. సరిగ్గా ఈ సంక్లిష్ట దశలో దాదాపు ఆపద్భాందవిగా భావిస్తోన్న కొవిడ్ ట్యాబ్లెట్లు లేదా మాత్రలు అందుబాటులోకి వచ్చాయి. కొవిడ్ చికిత్సలో తొలి ట్యాబ్లెట్ కు అమెరికాలో ఆమోదం లభించింది.


అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ FDA) ఇవాళ తొలి కొవిడ్ పిల్ కు ఆమోదముద్ర వేసింది. కొవిడ్ చికిత్సలో అత్యవసర వినియోగానికి ఫైజర్ సంస్థ రూపొందిన ట్యాబ్లెట్లకు అనుమతి ఇచ్చారు. పాక్స్‌లోవిడ్ (Paxlovid) పేరుతో వ్యవహరిస్తోన్న ఈ ట్యాబ్లెట్ కు అనుమతులు మంజూరు చేస్తున్నట్లు ఎప్డీఏ బుధవారం నాడు ప్రకటన చేసింది. అమెరికాలో కరోనాపై పోరులో ఈ ట్యాబ్లెట్ రాక విప్లవాత్మక మార్పును తెస్తుందని, ఫైజర్ వారి పాక్స్‌లోవిడ్ కొవిడ్ మాత్ర ప్రధాన మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

తీవ్రమైన కోవిడ్-19 లక్షణాలున్నవారికి ఈ ట్యాబ్లెట్లను అత్యవసరంగా వాడొచ్చని ఎఫ్డీఏ అమెరికాలోని ఆస్పత్రులకు సూచించింది. ఇప్పటికే కోటికిపైగా ట్యాబ్లెట్లను ఉత్పత్తి చేశామని, ఈ వారాంతంలోనే రోగులకు కొవిడ్ పిల్స్ అందుబాటులోకి వస్తాయని ఫైజర్ ఫార్మా సంస్థ సీఈఓ ఆల్బర్ట్ బౌర్లా తెలిపారు. ఎఫ్డీఏ అనుమతి తర్వాత సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఆమోదంతో ఫైజర్ వారి పాక్స్‌లోవిడ్ కొవిడ్ ట్యాబ్లెట్ల పంపిణీ వేగవంతం కానుంది. ఇక భారత్ విషయానికొస్తే..

అమెరికాలో కొవిడ్ చికిత్సకు తొలి ట్యాబ్లెట్ అనుమతి పొందిన నేపథ్యంలో అధిక జనాభాగల భారత్ లోనూ ట్యాబ్లెట్ల వాడకంపై చర్చ ఊపందుకుంది. ఇండియాలోనూ కొవిడ్ పిల్స్ కు అనుమతిచ్చే దిశగా కేంద్రం, సంబధిత సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. ప్రపంచంలోనే తొలి కొవిడ్ ట్యాబ్లెట్ గా రికార్డులకెక్కిన అమెరికా ఫార్మా సంస్థ మెర్క్ వారి 'మోల్నూపిరావిర్' (Molnupiravir)మాత్రను అత్యవసర వినియోగం కింద బ్రిటన్ గత నెలలో ఆమోదించింది. భారత్‌లోనూ మోల్నూపిరావర్ మాత్రను అత్యవసర వినియోగం కింద అనుమతించే దిశగా అడుగులు పడుతున్నాయని సీఎస్ఐఆర్ కోవిడ్ స్ట్రాటజీ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ రామ్‌ విశ్వకర్మ తాజాగా వెల్లడించారు. ఇప్పుడు ఫైజర్ (Pfizer) మాత్ర పాక్స్‌లొవిడ్ (Paxlovid)కు అమెరికా ఆమోదం లభించిన నేపథ్యంలో ఈ రెండిటికీ భారత్ కూడా అనుమతించే అవకాశాలున్నాయి.

No comments

Powered by Blogger.