AP రిజిస్ట్రేషన్ యూజర్ ఛార్జీలు భారీగా పెంపు
AP రిజిస్ట్రేషన్ యూజర్ ఛార్జీలు భారీగా పెంపు
అమరావతి: ప్రభుత్వం చడీచప్పుడు లేకుండా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ యూజర్ ఛార్జీలను ఏకంగా పదింతలు పెంచేసింది.
ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. 24 గంటల్లో ఉత్తర్వులను అమలుచేయాలని జిల్లా అధికారులను రిజిస్ట్రేషన్స్, స్టాంపుల శాఖ ఆదేశించింది.
మంగళవారం నుంచి అమల్లోకి వచ్చిన యూజర్ ఛార్జీలవల్ల ఒక్కో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్‌పై అదనంగా సుమారు రూ.750 వరకు భారం పడనుంది. ఆయా ప్రాంతాల్లోని ఆస్తుల మార్కెట్ విలువను తెలియచేస్తూ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ధ్రువీకరణపత్రాన్ని అందచేస్తుంది.
దీనికి ఇప్పటివరకు రూ.10 తీసుకుంటుండగా సవరించిన ధరల ప్రకారం రూ.50 చెల్లించాలి. ప్రతి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జి కింద ప్రస్తుతం రూ.100 నుంచి రూ.200 వరకు వసూలు చేస్తున్నారు. దీనిని రూ.500 చేశారు. రిజిస్ట్రేషన్ జరిగిన ఆస్తి తాలూకా దస్తావేజు నకలుకు ఇప్పటివరకు రూ.20 చెల్లిస్తున్నారు.
దీని ఖరీదు రూ.100 అయింది. 30 ఏళ్లలోపు వివరాలు తెలుసుకునేందుకు ఈసీ తీసుకుంటే ఫీజు కింద రూ.200, అంతకంటే ఎక్కువ కాలానికి తీసుకుంటే రూ.500 తీసుకుంటున్నారు. దీనికి యూజర్ ఛార్జి ప్రస్తుతం రూ.10 ఉండగా రూ.100 చేశారు. రిజిస్ట్రేషన్ చేయదలిచిన దస్తావేజులు పది దాటితే ఒక్కొక్క పేజీకి ప్రస్తుతం తీసుకునే రూ.5ను రూ.10గా నిర్ణయించారు. కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్టుమెంట్ (కార్డ్) కింద అందించే సేవల్లో భాగంగా హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్ ఎక్విప్‌మెంట్, పవర్ బ్యాకప్, విద్యుత్తు వినియోగ బిల్లు, ఇతర అవసరాలకు ఖర్చులు పెరిగాయని పేర్కొంటూ ఈ పెంపు నిర్ణయం తీసుకున్నారు.
నాన్ జ్యుడిషియల్ స్టాంపులకు కొరత
అవసరాలకు తగ్గట్లు నాన్-జ్యుడిషియల్ స్టాంపులను కక్షిదారులకు అందుబాటులో ఉంచడంలో రిజిస్ట్రేషన్స్, స్టాంపుల శాఖ విఫలమవుతోంది. రిజిస్ట్రేషన్స్, ఒప్పందాలు, అఫిడవిట్, ఇతరత్రా అవసరాల నిమిత్తం ఉపయోగించే ఈ స్టాంపులు కొన్ని జిల్లాల్లోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కానీ, వెండర్ల వద్ద కానీ లభించడంలేదు. విశాఖలాంటిచోట్ల వెండర్లు కృత్రిమ కొరత సృష్ట్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కర్నూలు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో రూ.100 స్టాంపులు మాత్రమే విక్రయిస్తున్నారు.
మరికొన్నిచోట్ల రూ.10, 50, 20 స్టాంపులు దొరకడంలేదు. దీంతో కొందరు తప్పని పరిస్థితుల్లో రూ.వంద స్టాంపులను కొనుగోలు చేస్తున్నారు. అమలాపురం, మదనపల్లి, ఒంగోలు వంటిచోట్ల కూడా స్టాంపుల కొరత ఎక్కువగా ఉంది. డిమాండు లేని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి వీటిని తెప్పించే చర్యలు కొన్ని జిల్లాల్లో జరుగుతున్నాయి.
No comments